టికెట్ రేట్ల పెంపుతోనే వినాశ‌నం మొద‌లైంది!

Dil Raju Reacts On Ticket Rates Hike

చలనచిత్ర రంగంలో ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన సినిమా టికెట్ల ధరలు థియేటర్ల వ్యవస్థను ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయో టాలీవుడ్ అగ్ర నిర్మాత, ఎగ్జిబిటర్ దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో విశ్లేషించారు. గతంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో `బాహుబలి` చిత్రాన్ని తెరకెక్కించిన సమయంలో 200 కోట్లతో తీయాల్సిన సినిమాని బ‌డ్జెట్ పెంచి 300 కోట్ల వ్యయంతో విజువల్ వండర్‌గా మార్చడానికి ప్రయత్నించారని గుర్తుచేశారు. ఆ భారీ వ్యయాన్ని తట్టుకోవడానికి పాన్ ఇండియా ప్రాజెక్ట్ నెపంతో ప్రభుత్వాలను సంప్రదించగా... వారు కూడా ఆ మేకింగ్ శ్రమను గుర్తించి 25 వరకు టికెట్ రేటు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారని దిల్ రాజు వివరించారు. అయితే కేవలం ఒక్క భారీ సినిమా బడ్జెట్ రికవరీ కోసం అప్పట్లో మొదలైన ఈ తాత్కాలిక సదుపాయం, రానురాను చిత్ర పరిశ్రమలో ఒక చెడు అలవాటుగా (కల్చర్‌గా) రూపాంతరం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల నిర్మాణ వ్యయం అదుపు తప్పుతుండటంతో నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడిని మొదటి వారంలోనే ఎలాగైనా వెనక్కి రాబట్టాలనే అత్యాశతో థియేటర్లను వ్యాపారంగా మార్చేస్తున్నారని దిల్ రాజు స్పష్టం చేశారు. సినిమా విడుదలైన మొదటి మూడు నాలుగు రోజులు లేదా ఒక వారం పాటు రికార్డు స్థాయిలో గరిష్ట స్క్రీన్లలో ప్రదర్శించి బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టాలనే ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. దీనికి తోడు నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటీటీ లలో ప్రత్యక్షమవుతుండటంతో ప్రేక్షకులు భారీ రేట్లు పెట్టి థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదని, అందుకే నెగెటివ్ టాక్ బయటకు రాకముందే ఫస్ట్ వీక్‌లోనే డబ్బులు లాగేయాలనే ఒత్తిడి మేకర్స్‌పై ఉంటోందని విశ్లేషించారు.

`బాహుబలి` చిత్రంతో పెట్టుబడి రాబ‌ట్టుకోవ‌డం కోసం పుట్టిన ఈ పద్ధతి, నేడు ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తూ కేవలం లాభాల వేటగా మారిపోయిందని దిల్ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు తెరలేపాయి. పెద్ద సినిమాల‌కు పెద్ద టిక్కెట్టు రేటు చెల్లించ‌లేక‌నే ఫ్యామిలీ ఆడియెన్ ఆస‌క్తిని కోల్పోయి థియేట‌ర్ల‌కు వెళ్లడం మానేసార‌ని దిల్ రాజు సూటిగానే విశ్లేషించారు. పెద్ద సినిమాల పేరుతో పెద్ద నిర్మాత‌ల అత్యాశ ఫ‌లితమిద‌ని కూడా అర్థం చేసుకోవ‌చ్చు.

 

Dil Raju about Ticket Rates Hike