రాజమౌళి గురించి షాకిచ్చే విషయం చెప్పిన రైటర్
Vijayendra Prasad about Rajamouliతనయుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా మేకింగ్ శైలిపై ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కాస్త ఘాటైన విశ్లేషణతో షాకిచ్చారు. సాధారణంగా రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ను అందరూ ప్రశంసిస్తుంటారు.. కానీ ఒక తండ్రిగా, కథా రచయితగా ఆయనలోని ఒక బలహీనతను లేదా తనకు నచ్చని ఒక ముఖ్యమైన అలవాటును విజయేంద్ర ప్రసాద్ నిర్మొహమాటంగా షేర్ చేసారు.
రాజమౌళి ఒక సినిమాను పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నప్పుడు.. ఆ ప్రాజెక్ట్ ముగింపు దశకు వచ్చేసరికి కూడా తన తదుపరి చిత్రం ఏంటనేది అస్సలు ప్లాన్ చేసుకోరని ఆయన గుర్తుచేశారు. ఒక సినిమా థియేటర్లలోకి వచ్చి విజయవంతమయ్యాక, ఆ తర్వాత కనీసం ఒకటి రెండు నెలల పాటు పూర్తిగా ఖాళీగా ఉంటూ.. ఆ విరామం తర్వాతే కొత్త కథ గురించి ఆలోచించడం రాజమౌళికి ఉన్న అలవాటు.
అయితే ఈ విధమైన పనితీరు తనకు అస్సలు నచ్చదని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఒక పెద్ద సినిమా పూర్తయ్యేలోపే దానికి సమాంతరంగా తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధంగా ఉంచుకుంటే... విలువైన సమయం వృథా కాకుండా వెంటనే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించవచ్చనేది ఆయన అభిప్రాయం.
ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రెండు సినిమాల మధ్య చాలా గ్యాప్ వస్తుందని... ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ మార్చుకుంటే బాగుంటుందని విజయేంద్రుడు పేర్కొన్నారు. అయినా ప్రస్తుత సినిమాపై రాజమౌళి చూపించే ఆ `ఏకపత్నీ వ్రతం` లాంటి అంకితభావాన్ని, నిమగ్నతను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తానని విజయేంద్ర ప్రసాద్ ముగించారు.







































