మళ్లీ మొదలవుతోన్న సంచలన ప్రేమాయణం

బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నిలిచిన `సలామ్-యే-ఇష్క్` చిత్రాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రం ఆ కాలంలో ప్రేమకథలకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా `సలామ్-యే-ఇష్క్ 2` నిర్మించేందుకు నిఖిల్ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఇది పాత కథకు కొనసాగింపు కాకుండా? సరికొత్త కథాంశంతో ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉంటుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించిన వార్తలు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ సీక్వెల్ కోసం నిఖిల్ అద్వానీ మళ్ళీ తన ఆస్థాన సంగీత దర్శకులైన శంకర్-ఎహసాన్-లాయ్ త్రయంతో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలోని పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సంగీత ప్రేమికులను అలరిస్తూనే ఉన్నాయి. అదే మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. పాటలే ఈ సినిమాకు ప్రధాన బలం కాబట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య పుట్టే ప్రేమను మళ్ళీ సంగీతమయంగా చూపించేందుకు టీమ్ కసరత్తులు చేస్తోంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే మొదటి భాగంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రియాంక చోప్రా వంటి భారీ తారాగణం నటించారు. సీక్వెల్‌లో కూడా నేటి తరం స్టార్ హీరో హీరోయిన్లతో పాటు కొంతమంది సీనియర్ నటులను కూడా తీసుకోవాలని నిఖిల్ యోచిస్తున్నారు. ఈ చిత్రం కూడా మల్టీస్టారర్ ఫార్మాట్‌లోనే ఉంటుందని వివిధ జంటల మధ్య ఉండే ప్రేమలోని సంక్లిష్టతలను ఇందులో ఆవిష్కరించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు నటీనటుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.








































