ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Revathy and Padmapriya Quit AMMA After a Decade

పెద్ద హీరో బాధ్య‌తారాహిత్యాన్ని ప్ర‌శ్నించిన న‌టి

Revathy and Padmapriya Quit AMMA After a Decade

మలయాళ నటీనటుల సంఘం `అమ్మ` (AMMA) లోని అంతర్గత పక్షపాతం, పురుషాధిక్య ధోరణులపై విసిగిపోయిన సీనియర్ నటీమణులు రేవతి, పద్మప్రియ తమ ప్రాథమిక సభ్యత్వాలకు స్వస్తి పలికారు. కేవలం ఏదో ఒక చిన్న సంఘటనను మనసులో పెట్టుకొని ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది కాదని.. దాదాపు పదేళ్లుగా తాము కోరుతున్న కనీస ఆత్మగౌరవం, పని ప్రదేశాలలో భద్రత, సమానత్వం వంటి ప్రాథమిక హక్కులు ఆ సంస్థలో లభించకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయానికి రావలసి వచ్చిందని వారు స్పష్టం చేశారు.

పరిశ్రమలో సురక్షితమైన వాతావరణం కోసం తాము ప్రశ్నించిన ప్రతిసారీ తోటి నటీనటులు, స్నేహితుల నుండి కేవలం మౌనం, దూరం మాత్రమే ఎదురయ్యాయని.. మార్పు రాని ఇటువంటి వ్యవస్థలో కొనసాగడం కంటే ఆత్మగౌరవంతో తప్పుకోవడమే ఉత్తమమని భావించి  వీడ్కోలు పలికామ‌ని తెలిపారు.

ముఖ్యంగా హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత `అమ్మ` సంఘంలో జరిగిన కొందరి రాజీనామాలు కేవలం  బాధ్యతారహితంగా పారిపోవడమే తప్ప, నైతిక విలువలతో కూడుకున్నవి కావని వారు తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదంపై ప్రజల దృష్టి కాస్త మళ్లగానే, పాత పురుషాధిక్య ధోరణులు, అధికార రాజకీయాలు మళ్లీ అదే పద్ధతిలో రాజ్యమేలుతున్నాయని వారు ఎండగట్టారు.

సంస్థలో ముఖాలు మారినా.. స్త్రీ పురుష అసమానతలను ప్రోత్సహించే మూల వ్యవస్థలు అలాగే ఉన్నాయని.. నమ్మకాన్ని కోల్పోయిన ఇలాంటి సంస్థలో సభ్యత్వం లేకపోయినా పర్వాలేదని వారు స్ప‌ష్టంగా చెప్పారు. ఒక మంచి సినీ వాతావరణం కోసం .. భ‌విష్య‌త్ తరం మహిళా కళాకారులు ఇటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండటం కోసం తాము చిత్ర పరిశ్రమలో స్వతంత్ర నిపుణులుగా తమ పోరాటాన్ని, ప్రయాణాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తామని రేవతి, పద్మప్రియ ప్రకటించారు.
 

Revathy and Padmapriya resign from AMMA