వివాదంలో క్వీన్ -2
Kangana Queen 2 lands in troubleబాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన సెన్సేషనల్ హిట్ `క్వీన్` చిత్రానికి సీక్వెల్‌గా `క్వీన్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వికాస్ బాల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం వివాదంలో చిక్కుకుంది.
ఈ సినిమాపై ఫాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టులో 250 కోట్ల దావా వేసింది.
సీక్వెల్ తమ మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించిందని.. తమ అనుమతి లేకుండానే నిర్మిస్తున్నారని సదరు స్టూడియో ఆరోపించింది. `క్వీన్` చిత్రంపై తమకూ 50 శాతం వాటా ఉందని.. సీక్వెల్స్ నిర్మించే హక్కులు కూడా తమకే ఉన్నాయని ఫాంటమ్ స్టూడియోస్ వాదిస్తోంది. ఈ విషయంపై తాము గత ఏప్రిల్ నుండే నోటీసులు పంపడమే కాకుండా జియోస్టార్- వికాస్ బాల్‌తో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేదని పేర్కొంది.
షూటింగ్ పూర్తి కావడంతో తప్పని పరిస్థితుల్లో చట్ట పరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై జియోస్టార్ సంస్థ నుండి ఎలాంటి స్పందన రాలేదు. భారీ దావా కారణంగా `క్వీన్ 2` విడుదలపై అనిశ్చితి నెలకొంది. చట్టపరమైన పోరాటం సినిమా విడుదల తేదీలను ప్రభావితం చేస్తుందా ? నిర్మాతలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారా? అనేది చూడాలి.







































