ఇద్దరు భామల మధ్య పోటీ కాదు ఇదో సంబరం!
Huma Qureshi Reacts To Box Office Clash Between Baby Do D*e Do and Alpha
ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు వాటి మధ్య బాక్సాఫీస్ యుద్ధం సహజం. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన `బేబీ డూ డై డూ`, అలాగే ఆలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్ చేసిన భారీ యాక్షన్ చిత్రం `ఆల్ఫా` ఒకే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి సమయాల్లో తీవ్రమైన పోటీ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈ క్లాష్‌ను హుమా ఖురేషి పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నారు.
తాను `ఆల్ఫా` చిత్రాన్ని అస్సలు పోటీగా భావించడం లేదన్నారు. చిత్ర పరిశ్రమలో అన్ని రకాల సినిమాలకు, కథలకు తగినంత స్పేస్ ఉంటుందని.. ప్రతి సినిమాకు తనదైన ప్రేక్షక వర్గం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. తమ `బేబీ డూ డై డూ` చిత్రం స్వతంత్రంగా రూపొందిన చిత్రమని.. ఆ వారాంతంలో మరే ఇతర సినిమాలు విడుదలవుతున్నాయనే విషయంపై దృష్టి పెట్టడం లేదన్నారు. తమ సినిమాను ఇష్టపడే ప్రేక్షకులను తాము ఖచ్చితంగా చేరుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఒకే రోజు ఇద్దరు మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడటం నిజంగా అద్భుతమైన పరిణామమని హుమా కొనియాడారు. చలనచిత్ర రంగం ఇలాంటి స్థాయికి చేరుకోవడం గర్వకారణమని, ఇది మహిళా ఆధారిత కథాంశాలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తన చిత్రంతో పాటు, ఇండస్ట్రీలో ఉన్న తోటి నటీమణులందరికీ తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, వారి విజయాలను కూడా ఎంజాయ్ చేస్తానని హుమా ఖురేషి ఎంతో పరిణతితో వ్యాఖ్యానించారు.







































