అగ్లీ గొడవల్లేకుండా కలిసిపోయిన మాజీ జంట
Arjun Kapoor and Malaika Arora together bring effortlessహిందీ చిత్రసీమలో దాదాపు ఆరేళ్ల పాటు సహజీవనం సాగించిన బాలీవుడ్ స్టార్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2024వ సంవత్సరంలో తమ బంధానికి స్వస్తి పలికారు. తాము విడిపోయామనే చేదు నిజానికి అర్జున్ స్వయంగా బహిరంగంగానే ఎండ్ కార్డు వేశారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం పరిపాటి... కానీ ఈ ఇద్దరు సెలబ్రిటీలు మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా నడుచుకుంటున్నారు. ఎక్కడా విభేదాలను రచ్చకెక్కించకుండా... తమ విడిపోవడానికి కారణాలను అత్యంత రహస్యంగా ఉంచుతూ.. ఒకరికొకరు సముచిత గౌరవాన్ని ఇచ్చుకుంటున్నారు. బ్రేకప్ తర్వాత కూడా చాలా అరుదుగా కొన్ని వేదికలపై కలిసి కనిపిస్తూ... తమ నడుమ ఉన్న ఒక ఉన్నతమైన... పరిణతి చెందిన స్నేహ భావాన్ని చాటుకుంటున్నారు.
గత 2018 నుండి ప్రారంభమైన వీరి ప్రయాణం ఎన్నో ఉత్థానపతనాల మధ్య సాగి... చివరకు ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మలైకా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమ బంధం తెగిపోయిన తరుణంలో ఎవరికైనా ఎదురయ్యే మానసిక వేదన, ఆవేదన, ఆగ్రహం వంటి సహజమైన భావోద్వేగాలను తాను కూడా చవిచూశానని మలైకా నిష్కపటంగా అంగీకరించారు. అయితే కాలం గాయాలను మాన్పుతుందని... ప్రస్తుతానికి తమ మధ్య ఎలాంటి ద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఒక ప్రేమికుడిగా దూరం కావచ్చు కానీ, తన జీవిత ప్రయాణంలో అర్జున్ ఎప్పటికీ ఒక అమూల్యమైన స్థానాన్ని కలిగి ఉంటారని ఆమె పేర్కొనడం వీరి నడుమ ఉన్న శాశ్వతమైన బంధానికి అద్దం పడుతోంది.
అయితే విడిపోయినా కలిసి ఉండాలనే కాన్సెప్ట్ కి మలైకా- అర్జున్ వ్యతిరేకంగా లేరు. ఈ జంట మరోసారి ఓ ఈవెంట్లో కలిసినప్పుడు ఇలా హుందాగా కలిసిపోయారు. కలిసి ఉంటే కలదు సుఖం! అన్న తీరుగా ఈ మాజీ జంట అన్యోన్యతకు ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు. జంటలు విడిపోయినప్పుడు జరిగే చాలా అగ్లీ గొడవలు లేకుండా ఎంత హాయిగా ఉన్నారో కదా!







































