నటిపై వేధింపులు..క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు!
Actress accuses casting agent of misconductచిత్ర పరిశ్రమలో రాణించాలనే బలమైన కోరికతో వచ్చే నూతన నటీనటులను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు అక్రమాలకు, వేధింపులకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై సినీ నటి ఫిర్యాదు చేయడం చిత్ర వర్గాల్లో సంచలనంగా మారింది.
ఓ పెద్ద చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర పోషించిన సదరు నటికి ఒప్పందం ప్రకారం రావాల్సిన 90 వేల పారితోషికం.. 38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా నిందితుడు నెలల తరబడి కాలయాపన చేస్తున్ఆడు.
బకాయి పడ్డ డబ్బుల విషయమై మాట్లాడటానికి ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని ప్రముఖ ప్రొడ్యూసర్ ఆఫీస్ వద్దకు రావాలని సదరు నటిని పిలిపించాడు. అక్కడ మరింత బరితెగించి ప్రవర్తించాడు.
రావాల్సిన బకాయిలు ఇవ్వకపోగా, ఆమెను భయపెట్టి బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. చిత్ర పరిశ్రమలో మరిన్ని పెద్ద అవకాశాలు ఇప్పిస్తానని, అందుకు బదులుగా తన కోరికలు తీర్చాలంటూ కారులోనే అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాధితురాలు ఎలాగో అక్కడి నుండి తప్పించుకుని తల్లికి విషయం చెప్పగా నిందితుడు ఆమె తల్లిని సైతం ఫోన్ లో తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. మానసిక వేధింపులు, బెదిరింపులపై సదరు నటి ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.







































