అంబానీని వెనక్కి నెట్టిన టిక్‌టాక్ అధినేత!
TikTok Billionaire Overtakes Mukesh Ambaniఆసియాలోనే అత్యంత ధనవంతుల రేసులో గత కొంతకాలంగా భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఒకరితో ఒకరు పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చైనా టెక్ దిగ్గజం `బైట్‌డ్యాన్స్` వాల్యుయేషన్ అనూహ్యంగా పెరగడంతో, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, టిక్‌టాక్ అధినేత జాంగ్ యిమింగ్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జాంగ్ నికర ఆస్తి విలువ ఏకంగా 92.8 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానానికి పడిపోయారు. కాగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 117.4 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
జాంగ్ యిమింగ్ సంపద ఈ స్థాయిలో పెరగడానికి బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్ అంతర్జాతీయ విజయంతో పాటు.. చైనాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన వారి `దౌబావో` AI చాట్‌బాట్ సాధిస్తున్న విజయాలే ప్రధాన కారణం. అమెరికాలో ఎదుర్కొన్న రాజకీయ, నియంత్రణపరమైన సవాళ్లను అధిగమించేందుకు వీలుగా బైట్‌డ్యాన్స్ తన యూఎస్ వ్యాపార భాగాలను ఒరాకిల్, సిల్వర్ లేక్ వంటి ఇన్వెస్టర్ల కన్సార్టియానికి బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్ భారీగా తగ్గింది.
ఫలితంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల తాజా విశ్లేషణల తర్వాత జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం ఈ చైనీస్ సోషల్ మీడియా లీడర్ అంతర్జాతీయంగా అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ కృత్రిమ మేధ (AI) రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఏకంగా 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది.







































