పెద్ది: సినీజోష్ రివ్యూ
Peddi Movie Reviewపెద్ది: సినీజోష్ రివ్యూ
దర్శకుడు: బుచ్చి బాబు సానా
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
విడుదల తేదీ: 2026-04-06
తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు.
పెద్ది గురించి ముందు మాట:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తిరిగి తన పట్టును నిరూపించుకోవాల్సిన కీలక తరుణంలో వచ్చిన చిత్రం పెద్ది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి అంతర్జాతీయ సక్సెస్ తర్వాత, గేమ్ ఛేంజర్, ఆచార్య చిత్రాల పరాజయాలతో చరణ్ అభిమానులు ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ కెరీర్‌లోనే మొదటిసారిగా నటించిన స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పెద్ది కథా నేపథ్యం:
భారత ప్రభుత్వ గుర్తింపునకు కూడా నోచుకోని ఒక మారుమూల గ్రామానికి గుర్తింపు తీసుకురావడానికి ఒక యువకుడు చేసే పోరాటమే పెద్ది కథ. కథానాయకుడు పెద్ది (రామ్ చరణ్) ఒక సాధారణ కాంట్రాక్ట్ కూలీ. క్రికెట్ మైదానంలో తన ప్రతిభతో ఎవరినైనా గెలిపించే సత్తా ఉన్నవాడు. అయితే కొన్ని అనూహ్య పరిణామాలు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అచ్చియమ్మ (జాన్వీ కపూర్), రామ్ బుజ్జి (దివ్యేందు శర్మ), అప్పలసూరి (జగపతి బాబు), స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బైస్వాల్ (బోమన్ ఇరానీ), రెజ్లర్ గౌరునాయుడు (శివ రాజ్‌కుమార్) లతో పెద్దికి ఉన్న సంబంధం ఏంటి అనేదే మిగతా కథ.
పెద్ది నటీనటుల ప్రదర్శన:
ఈ చిత్రంలో రామ్ చరణ్ తన నటనతో.. ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్‌తో సరికొత్త స్థాయిని ఆవిష్కరించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక క్రికెటర్ గా, రెజ్లర్ గా అతడు చూపించిన వేరియేషన్స్, ఎమోషనల్ సీన్స్‌లో కళ్ళతోనే పలికించిన హావభావాలు అద్భుతం. ముఖ్యంగా చరణ్ డాన్స్ మూవ్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి. అయితే భారీ తారాగణం ఉన్నా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లేందుకే పరిమితమయ్యాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కావడం, కథనంలో స్పీడ్ బ్రేకర్ లా మారడం మైనస్. జగపతి బాబు ఎమోషనల్ పాత్రలో రాణించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ రెజ్లర్ పాత్రలో తనదైన శైలిలో మెప్పించారు. టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన దివ్యేందు శర్మ పాత్ర ప్రారంభంలో ఆసక్తికరంగా ఉన్నా.. ఆ తర్వాత సాగదీసినట్లు అనిపిస్తుంది. బోమన్ ఇరానీ, రవి కిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలేం నరేన్, తారక్ పొన్నప్ప, మహేష్ అచంట వంటి ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. శ్రుతిహాసన్ స్పెషల్ నంబర్ ఫ్యాన్స్ లో హుషారు పెంచుతుంది.
పెద్ది సాంకేతిక విభాగం- స్క్రీన్‌ప్లే:
దర్శకుడు బుచ్చిబాబు సన మొదటి భాగంలో మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ హంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒక దర్శకుడిగా అతడి విజన్ ని, ఆలోచనలను ప్రశంసించి తీరాలి. కొన్ని లోపాలు ఉన్నా మేకింగ్ శైలితో మెప్పించాడు. ఒలింపిక్స్‌లో దేశ ప్రదర్శన గురించిన ఆరంభ దృశ్యాలు, చరణ్ మాస్ ఇంట్రడక్షన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా తెరకెక్కించి మెప్పించాడు. లవ్ ట్రాక్ వల్ల అక్కడక్కడా కథనం నెమ్మదించినా... ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేయగలిగాడు.
ద్వితీయార్థంలో ఎమోషన్స్ డోస్ పెరిగింది. అయితే ఈ ఎమోషన్స్ ను ఎలివేట్ చేసే క్రమంలో సినిమా వేగం చాలా వరకు తగ్గింది. క్రికెట్ మ్యాచ్‌లు గ్రాండ్‌గా షూట్ చేసినా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోతే కొన్ని చోట్ల సాధారణంగానే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే స్పెషల్ సాంగ్ తర్వాత కథనం రొటీన్‌గా ముగుస్తుంది అనుకునే సమయంలో బుచ్చిబాబు ఇచ్చిన స్క్రీన్‌ప్లే ట్విస్ట్ బాగుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత హుషారు పెంచే పక్కా మాస్ నంబర్లతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని, స్పోర్ట్స్ సీన్లను విజువల్ వండర్‌గా మార్చింది. ఎడిటర్ నవీన్ నూలి కొన్ని చోట్ల సీన్లను అకస్మాత్తుగా కట్ చేసినట్లు అనిపిస్తుంది. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా చాలా రిచ్ గా ఉన్నాయి.
పెద్ది ప్లస్ పాయింట్స్:
- రామ్ చరణ్ నటన, ఎనర్జీ, డ్యాన్సులు
- ఉత్సాహం నింపే పాటలు - నేపథ్య సంగీతం
- భావోద్వేగ సన్నివేశాలు
- ఆకట్టుకునే సందేశం
పెద్ది మైనస్ పాయింట్లు:
- లాజిక్ లేని సన్నివేశాలు
- పస లేని కొన్ని వీక్ రోల్స్
పెద్ది (2026) సినిమా: రేటింగ్ విశ్లేషణ
ఇది ఒక ఎనర్జిటిక్ స్పోర్ట్స్ డ్రామా. అణువణువునా ఉద్వేగాన్ని చేర్చడంలో టీమ్ కృషి సఫలమైంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనలో అతని చిత్తశుద్ధి, అంకితభావం- కృషి తెరపై కనిపిస్తాయి. అతడు తన నటనతో సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. రామ్ చరణ్ స్టార్‌డమ్ - అభిమానులను దృష్టిలో ఉంచుకుని బుచ్చి బాబు సానా సినిమాలోని మెజారిటీ పార్ట్ ని మాస్ అంశాలతో నింపేశారు. అతను తెరపై రామ్ చరణ్ శైలిని, హావభావాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. కానీ ఇది కొన్నిసార్లు కథ - కథనంపై ప్రభావం చూపింది. ద్వితీయార్థంలో ఆలోచింపజేసే సంభాషణలు, సహజమైన - వాస్తవిక భావోద్వేగాలు, సమాజానికి బలమైన సందేశంతో ఆకట్టుకున్నారు. స్క్రీన్‌ప్లే పర్వాలేదు అనిపించగా, బుచ్చి బాబు సానా తనదైన శైలిలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగుపరిచి, అనవసరమైన, అసంబద్ధమైన సన్నివేశాలను తొలగించి ఉంటే `పెద్ది`కి మరింత పటిష్టత చేకూరి ఉండేది. సాధారణ ఆడియెన్ పల్స్ ని దృష్టిలో ఉంచుకుని సినీజోష్ `పెద్ది`కి ఇచ్చిన రేటింగ్ 3 స్టార్.
పెద్ది గురించి చివరి మాట:
పెద్ది మీరు అంచనా వేసే ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాకపోవచ్చు... కథనంలో కొన్ని లోపాలు, స్లోఫేస్ ఉన్నా.. రామ్ చరణ్ తన వన్‌మెన్ షోతో... అద్బుతమైన ఇంటర్వల్, ఉత్కంఠ రేకెత్తించే భావోద్వేగభరితమైన క్లైమాక్స్ తో సినిమాను నిలబెట్టారు.
పంచ్ లైన్: పెద్ది - పెద్ద రంగస్థల అనుభవం
సినీజోష్ రేటింగ్: 3 / 5







































