వ్యక్తిగత విషాదం నుంచి మళ్లీ కెమెరా ముందుకు!

ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ తన జీవితంలో ఎదురైన అత్యంత కష్టతరమైన దశ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2009లో తన భార్య రీనా దేవ్ క్యాన్సర్‌తో మరణించిన తర్వాత కుమారుడి బాధ్యతలను చూసుకోవడం కోసం నాలుగేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. సింగిల్ ఫాదర్‌గా కొడుకును పెంచడం కోసం కెరీర్‌ను పక్కన పెట్టిన రాహుల్ ఆ నిర్ణయం వల్ల తన వృత్తిపరమైన జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా వెల్లడించారు.
నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ నటించాలని అనుకున్నప్పుడు పరిశ్రమ తనను మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 80కి పైగా సినిమాల్లో నటించినా? తిరిగి పని కోసం ప్రయత్నించినప్పుడు ఎవరూ తనను గుర్తించలేదన్నారు. ఆ సమయంలో అవకాశాలు రావడం ఎంతో కష్టమైందని రాహుల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సలహా మేరకు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో పాల్గొని మళ్లీ కెరీర్‌ను గాడిలో పెట్టుకున్నట్లు వివరించారు. వెండితెరపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన తనకు వాస్తవ జీవితంలో మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టడం పెద్ద సవాలుగా నిలిచిందన్నారు.
రాహుల్ దేవ్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. వ్యక్తిగత బాధ్యతల కోసం కెరీర్‌ను త్యాగం చేసినా? పట్టుదలతో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన `వెల్కమ్ టు ది జంగిల్` వంటి భారీ చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. గతాన్ని తలుచుకుని బాధపడకుండా? తన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే నిజమైన విజయమని నిరూపిస్తున్నారు. మూగజీవాల పట్ల మమకారం, ఆధ్యాత్మిక చింతన ఆయనను వ్యక్తిగతంగా మరింత దృఢంగా మార్చాయన్నారు.







































