ఆ హీరో ప్రకటన వెనుక అసలు నిజం!
Sunny Deol old pan masala Adబాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎప్పటికీ పాన్ మసాలా ప్రకటనలలో నటించనని స్పష్టం చేయడం సంచలనం సృష్టించింది. సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే ఉత్పత్తులను తానెప్పుడూ ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. దేశభక్తి చిత్రాలు.. యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలకు అభిమానుల నుంచి భారీ మద్దతు లభించింది. అయితే ఆయన చేసిన ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే ఇంటర్నెట్‌లో ఓఆసక్తికర మలుపు చోటు చేసుకుంది.
సన్నీ డియోల్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఆయన గతంలో నటించిన పాత పాన్ మసాలా టొబాకో సంబంధిత బ్రాండ్ యాడ్ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ ప్రత్యక్షమైంది. ఆ పాత వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. తానేనైతే ఎప్పటికీ అలాంటి ప్రకటనలు చేయనని చెప్పిన కొద్దిరోజులకే పాత యాడ్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు సన్నీ డియోల్ అభిమానులు పాత కాలపు బ్రాండ్ ప్రమోషన్ అని సమర్థిస్తుంటే? మరికొందరు మాత్రం ఆయన మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని విమర్శిస్తున్నారు.
ఇదే సమయంలో బాలీవుడ్‌లోని మరికొంత మంది అగ్ర హీరోలైన షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ వంటి ప్రముఖ నటులకు ఫుడ్ అండ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నుంచి నోటీసులు అందడం కూడా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పాన్ మసాలా .. గుట్కా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టింది. ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను సెలబ్రిటీలు ప్రచారం చేయడం పట్ల సామాజిక కార్యకర్తలు .. ప్రభుత్వ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సెలబ్రిటీలు చేసే ప్రకటనల పట్ల ఎంతటి సామాజిక బాధ్యత కలిగి ఉండాలనే చర్చ మరోసారి తెరపైకి వస్తోంది. కోట్లాది మంది అభిమానులు అనుసరించే అగ్ర హీరోలు ఇలాంటి హానికరమైన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరైనదేనా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ.. అటు మేధావుల మధ్య నడుస్తున్నాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వస్తుందనే? ఉద్దేశంతో ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టే ప్రకటనలలో నటులు నటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.







































