రామాయణం ట్రైలర్ టాక్ ఏంటి?
Ramayana Trailer Talkభారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణ` ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం పూర్తి భిన్నమైన వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా అయోధ్య రాజసాని, లంకా నగరానికి సంబంధించిన అద్భుతమైన సెట్టింగ్‌లు, అత్యున్నత సాంకేతిక విలువలు సినిమాపై ప్రేక్షకుల్లో సరికొత్త అంచనాలను నింపుతున్నాయి.
ఈ ట్రైలర్‌లో ప్రధాన పాత్రధారుల అప్పియరెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లంకాధీశుడు రావణుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ .. పోషించిన క్రూరమైన, శక్తివంతమైన పాత్ర తాలూకు లుక్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నట్లు స్పష్టమవుతోంది. యశ్ హావభావాలు, రౌద్ర రూపం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
మర్యాద పురుషోత్తముడైన రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ అభినయంపై మాత్రం భిన్న ధృక్పథాలు వినిపిస్తున్నాయి. రాముడిలో ఉండాల్సిన ప్రశాంతతను, రాజసం ఉట్టిపడే హుందాతనాన్ని ఆయన పక్కాగా పండించారని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం డైలాగ్ డెలివరీ శైలిపై పెదవి విరుస్తున్నారు.
ఇంతటి భారీ తారాగణం ఉన్న ట్రైలర్‌లో హనుమంతుడి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ఒక్క విజువల్ కూడా కనిపించకపోవడం అభిమానులకు కాస్త నిరాశకు గురి చేస్తుంది. ఆ పాత్రను మేకర్స్ పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారా లేదా రెండో భాగం కోసం ప్రత్యేక సర్ప్రైజ్‌గా దాచారా అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఏఆర్ రెహమాన్ - హాన్స్ జిమ్మర్ మ్యాజికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, DNEG సంస్థ అందిస్తున్న అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తున్నాయి.







































