మోదీ-షాలకు బాలీవుడ్ భయపడుతోందా?
PM Modi - Amit Shahసోనం వాంగ్‌చుక్ వంటి సామాజిక కార్యకర్తలు దేశహితం కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షల పట్ల బాలీవుడ్ సెలబ్రిటీలు చూపిస్తున్న మౌనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గతంలో సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన సినీ తారలు ఇప్పుడు ఒక వర్గం ఉద్యమాల విషయంలో వెనకడుగు వేయడం చూస్తుంటే? వారిలో ఏదో తెలియని భయం రాజ్యమేలుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాజ్, విజయ్ దళపతి వంటి వారు మినహాయిస్తే మెజారిటీ తారలు దీనిపై స్పందించేందుకు జంకుతున్నారా? అన్న మాట వినిపిస్తోంది .
ఈ భయానికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలోని ప్రభుత్వం అని రాజకీయ విశ్లేషకులు .. బాలీవుడ్ మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదా వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలపడం వల్ల తమ కెరీర్‌పై, వ్యక్తిగత ప్రతిష్టపై ప్రభావం పడుతుందనే ఆందోళన వారిని వెంటాడుతోందని కథనాలొస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో తాము ముందుండాలని అనుకున్నా? నియంత పోకడల భయం వారి గొంతును నొక్కేస్తోందని కొందరంటున్నారు.
సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల ఐటి రైడ్స్, సోషల్ మీడియా ట్రోలింగ్ , ప్రభుత్వ అనుకూల శక్తుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను భరించడం కష్టమని కొందరు భావించి ముందుకు రావడం లేదంటున్నారు. అందుకే బహిరంగంగా మద్దతు తెలపడం కంటే? వ్యక్తిగత స్థాయిలో మౌనంగా ఉండటమే సురక్షితమైన మార్గం అని చాలామంది సెలబ్రిటీలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది నటీనటుల స్వేచ్ఛా స్వరానికి ... వారి సామాజిక బాధ్యతకు మధ్య జరుగుతున్న సంఘర్షణను ప్రతిబింబిస్తోంది.
ఒక సెలబ్రిటీకి ఉండే సామాజిక బాధ్యత వారి భయానికి బందీ కావడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. కవులు, కళాకారులు , సెలబ్రిటీలు సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన వారు. కానీ అధికారాన్ని చూసి భయపడి నిశ్శబ్దాన్ని పాటిస్తే? అది కాలక్రమేణా సామాజిక చైతన్యాన్ని దెబ్బతీస్తుందని ఓ రచయిత అభిప్రాయప్డారు. ఇప్పటికైనా నటీనటులు భయాన్ని వీడి ప్రజా సమస్యలపై స్పందిస్తారా? లేదా? ఇలాగే మౌన వ్రతాన్ని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.







































