ఫైనాన్స్ కష్టాలపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
Dil Raju makes sensational comments on financial strugglesవెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక నిర్మాతలు పడే ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు వర్ణనాతీతమని.. ఫైనాన్స్ తెచ్చి సినిమాలు తీయడం ఆషామాషీ వ్యవహారం కాదని అగ్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఒక సినిమాను పట్టాలెక్కించడానికి నిర్మాతల సొంత పెట్టుబడి, బ్యాంక్ వనరులు, నాన్-థియేట్రికల్ బిజినెస్ రెవెన్యూతో పాటు బయట మార్కెట్ నుండి తెచ్చే ఫైనాన్స్ అనే నాలుగు మార్గాలు ముఖ్యమని వివరించారు. బ్యాంకులు కేవలం పర్సనల్ ఆస్తులను చూసి మాత్రమే లోన్స్ ఇస్తాయని చెబుతూ.. ఒకవేళ సినిమా బడ్జెట్ 200 కోట్లు అనుకుంటే, అందులో 100 కోట్లు ఫైనాన్స్ రూపంలోనే ఉంటుందని లెక్కలతో వివరించారు.
చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఏకంగా 36 శాతం వడ్డీ వసూలు చేసేవారని, అది ఇప్పుడు మెల్లిగా తగ్గుతూ 24 శాతానికి వచ్చిందని తెలిపారు. ఈ 24 శాతం వడ్డీ లెక్క ప్రకారం చూసినా... ఒక నిర్మాత 100 కోట్ల ఫైనాన్స్ తీసుకుంటే కేవలం వడ్డీ రూపంలోనే సంవత్సరానికి ఏకంగా 24 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కోట్లాది రూపాయల వడ్డీల భారాన్ని మోస్తూ.. నటీనటుల, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్లను భరిస్తూ సినిమా సక్సెస్ కోసం సర్వస్వం పణంగా పెట్టే నిర్మాతకు ఇది నిజంగా తలకు మించిన భారమేనని ఆయన చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సేఫ్ జోన్ లో ఉండేది యాక్టర్లు, టెక్నీషియన్లు, వడ్డీలకు డబ్బులిచ్చే ఫైనాన్సియర్లు మాత్రమేనని, కానీ ఒక నిర్మాత పరిస్థితి మాత్రం ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉండదని దిల్ రాజు వ్యాఖ్యానించారు. వీరందరికీ రావలసిన చెల్లింపులు పూర్తి చేసి, అప్పులన్నీ తీర్చిన తర్వాతే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో లాభాలు వస్తే.. అందులో చిట్టచివరిగా మిగిలేది మాత్రమే నిర్మాతకు దక్కుతుందని ఆయన ప్రాక్టికల్ విశ్లేషణ ఇచ్చారు. ఈ చేదు నిజాలు విన్న తర్వాత సినిమా ప్రొడక్షన్ అనేది బయటకు కనిపించేంత ఈజీ కాదని, ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని స్పష్టమవుతోంది.







































