ట్రోలర్స్‌కి గట్టిగా బుద్ధి చెప్పిన రజనీకాంత్
Rajinikanth loses patience with trolls
తన స్నేహితుడు కమల్ హాసన్ బ్యానర్ లో నటించే సినిమా టైటిల్ ని రజనీకాంత్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు మారగా చివరికి ఒకరిని ఫైనల్ చేసారు. అశ్వత్ మారిమత్తు ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా `ధర్మన్` అనే టైటిల్ ని ప్రకటించారు. `ధర్మన్` టైటిల్ లాంచ్ వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా ట్రోల్స్, పబ్లిక్ విమర్శలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ఒక సెలబ్రిటీగా తన ప్రతి మాట, చేత ఎప్పుడూ నిశితంగా పరిశీలనకు గురవుతుంటాయని, తాను ఏం చేసినా జనాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కడైనా బహిరంగంగా మాట్లాడటానికి తానేంతో వెనుకాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడితే అది తనతో పాటు ఇతరులకు కూడా లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుందని...తన మాటలను వంకరగా తిప్పి రకరకాల పుకార్లను ప్రచారంలోకి తెస్తున్నారని రజనీకాంత్ విమర్శించారు.
మరోవైపు వివాదాలకు భయపడి తాను మౌనంగా ఉంటే.. అప్పుడు కూడా జనాలు ఊరుకోకుండా ``ఎందుకు మాట్లాడటం లేదు? నోట్లో ఏమైనా పెట్టుకున్నావా?`` అంటూ ఎగతాళి చేస్తారని సూపర్ స్టార్ మండిపడ్డారు. మాట్లాడితే ఒక సమస్య, మౌనంగా ఉంటే మరో సమస్యగా మారిన ఈ విచిత్ర పరిస్థితిని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని, అందుకే తన మాటలు ఎలాగూ వివాదాలకు దారితీస్తాయనే నిజంతో తాను రాజీపడిపోయానని స్పష్టం చేశారు. తాను చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా మెచ్చుకోవాలని తాను ఆశించడం లేదని చెబుతూ.. ట్రోలర్స్‌కు ఆయన తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు.







































