Loading...

కొత్త రిలీజ్ లు ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాయా?

New Releases

 

ఒకప్పుడు సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని  థియేటర్లు దొరికితే చాలు.   సినిమా సమయానికి విడుదలయ్యే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత ట్రెండ్‌లో ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. షూటింగ్ పూర్తి చేయడం మాత్రమే కాకుండా నాన్-థియేట్రికల్ హక్కుల వ్యాపారం, ఓటీటీ ఒప్పందాల నిబంధనలు, బాక్సాఫీస్ వద్ద ఉండే పోటీ వంటి అనేక అంశాలు చిత్రాల విడుదల తేదీలను శాసిస్తున్నాయి. దీనికి తోడు కంటెంట్, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఫలితంగా, మొదట ప్రకటించిన తేదీలకు సినిమాలు రిలీజ్ అవ్వ‌డం లేదు. ప్రమోషన్లను ముమ్మరంగా సాగిస్తున్నా? సరైన విడుదల సమయం కోసం మేకర్స్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న  భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం `విశ్వంభర`ను ముందుగా చెప్పాలి. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ  ప్రతిష్టాత్మక సినిమా  2025 సంక్రాంతి బరిలోనే నిలవాల్సింది. కానీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తికాకపోవడంతో విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఎప్పుడు రిలీజ్ అవుతుందో  కూడా క్లారిటీ లేకుండా పోయింది. `స్వ‌యంభు` రిలీజ్ విష‌యంలోనూ ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఇదిగో రిలీజ్ అదుగో రిలీజ్ అన్న మాట త‌ప్ప రిలీజ్ ఎప్పుడు? అన్న‌ది ఏ మాత్రం క్లారిటీ లేదు. `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్`, `సంబ‌రాల ఏటి గ‌ట్టు`, ` కొరియ‌న్ క‌న‌క‌రాజు`, `చెన్నై లవ్ స్టోరీ` లాంటి చిత్రాలు ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకొస్తాయి? అన్న‌ది ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

సినిమా కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే దర్శకులు, నిర్మాతలు ఆలస్యాన్ని స్వాగ తిస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లలో అద్భుతమైన విజువల్స్ ఆశిస్తున్న తరుణంలో నాణ్యమైన అవుట్‌పుట్ కోసం అదనపు సమయం కేటాయించడం పరిశ్రమ పరంగా మంచి పరిణామమే  అయినా?   ప్రేక్షకుల, అభిమానుల ఓపికకు పరీక్షగా మారుతోందన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tollywood