అవార్డు ఇస్తామంటేనే వేడుకలకు వస్తారు!
Murali Mohan recently made interesting comments about actors and award functions
చిత్ర పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన తర్వాత చాలామంది నటీనటులు తాము సాధారణ ప్రజల కంటే భిన్నమైన వ్యక్తులమనే అహాన్ని పెంచుకుంటారని సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ గారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తెలుగు స్టార్లలో కొందరు గ్లామర్ ప్రపంచంలో ఉంటూ తాము సాధారణ మానవులం కాదని.. ప్రజల దృష్టిలో దేవతాంశ సంభూతులం అనే భ్రమలో జీవిస్తున్నారని ప్రముఖ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ అనగా, దానికి మురళీమోహన్ కూడా అవునంటూ మద్దతు పలికారు.
బాలీవుడ్‌తో పోలిస్తే మన దక్షిణాది నటుల్లో ఆ హంబుల్‌నెస్ లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాంబేలో ఫిలింఫేర్ లేదా జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డుల వేడుకలు జరిగితే, అమితాబ్ బచ్చన్ అంతటి మహానటుడైనా సరే తోటి కళాకారుల ప్రతిభను అభినందించడానికి స్వయంగా హాజరవుతారని, కానీ మన సౌత్‌లో కేవలం తమకు నంది అవార్డు వస్తుందని ముందే తెలిసిన స్టార్లు మాత్రమే ఆ వేడుకలకు రావడం ఇక్కడివారి మనస్తత్వానికి అద్దంపడుతుందని ఆర్కేతో పాత ఇంటర్వ్యూలో అన్న క్లిప్ వైరలవుతోంది.
తాను కూడా ఒకానొక దశలో అలాంటి అహాన్ని ఎదుర్కొన్నానని, అయితే చాలా త్వరగానే ఆ భ్రమ నుండి బయటపడి వాస్తవికతను గ్రహించానని మురళీమోహన్ వెల్లడించారు. జనం అభిమానిస్తేనే తాము గొప్పవాళ్లమనే సత్యాన్ని మర్చిపోయి, ఇప్పటికీ కొంతమంది స్టార్లు అదే అహంకారపూరిత వైఖరిని ప్రదర్శించడం సరికాదన్నారు.
కేవలం అవార్డులు లేదా వ్యక్తిగత గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే వేదికలపై కనిపించాలనుకోవడం కాకుండా.. తోటి కళాకారుల ప్రతిభను గౌరవించడం.. పరిశ్రమకు సంబంధించిన భారీ పండగల్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. గ్లామర్ శాశ్వతం కాదు.. మంచితనం గుర్తింపు ఒదిగి ఉండే తత్వం మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని అన్నారు.







































