పరిష్కారం వదిలి పంతాలకు పోతున్నారా?

Exhibitors vs Producers

టాలీవుడ్ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, సవాళ్లకు దారితీస్తోంది. ప్రధానంగా పెద్ది, ఫౌజీ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎగ్జిబిటర్లు పర్సంటేజీ షేరింగ్ పేరుతో కొత్త నిబంధనలు తీసుకురావడంపై నిర్మాత మైత్రి రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఏడాదికి వచ్చే 150 సినిమాలకు లేని అభ్యంతరాలు, కేవలం భారీ వసూళ్లు రాబట్టే ఆ ఐదారు సినిమాలపైనే ఎందుకు చూపుతున్నారని ఆయన నిలదీశారు.

ఇది సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నంలా లేదని.. కేవలం నిర్మాతలను, పంపిణీదారులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి అందులో వాటాలు కోరడమేనని ఆయన మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే పెద్ద సినిమాల రిలీజ్ టైమ్‌లో ఇలాంటి వివాదాలను తెరపైకి తెస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు నిర్మాత నాగవంశీ ఎగ్జిబిటర్ల తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా హిట్టవ్వాలని కోరుకోవాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పది వేల రూపాయలకే స్పెషల్ షోలు వేస్తున్నారన్న ఎగ్జిబిటర్ల వాదనను ఆయన సెటైరికల్‌గా కొట్టిపారేశారు. ఒక సినిమా సెంటిమెంట్ కోసం లక్షల రూపాయలు రెంట్ కట్టి ఉచిత టికెట్లు ఇచ్చి షోలు వేసిన చరిత్ర తమదని గుర్తు చేశారు.

థియేటర్లకు తాము కట్టే రెంట్లలో అసలు ఓనర్లకు ఎంత చేరుతుందో సిబిఐ వచ్చినా కనిపెట్టలేదని.. పంపిణీ వ్యవస్థను చంపి ఎవరిని బాగు చేయడానికి ఈ పర్సంటేజీ విధానం తెస్తున్నారని నాగవంశీ సూటిగా నిలదీశారు. ఈనెల 15న సినీపెద్ద‌ల స‌మ‌క్షంలో రెంట‌ల్ విధాన‌మా లేక ప‌ర్సంటేజీ విధానమా? అనేదానిపై పంచాయితీ ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. కాబ‌ట్టి ఇంకో 24గంట‌లు వేచి చూస్తే మ‌రికొంత క్లారిటీ వ‌స్తుందేమో!

Exhibitors Vs Producer In Tollywood Film Industry