Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Big Budget films - The latest marketing strategy

వంద‌ల కోట్ల బ‌డ్జెట్ అంతా మార్కెటింగ్ మాయాజాల‌మేనా?

Big Budget films - The latest marketing strategy

 

ప్యాన్-ఇండియా సినిమా కాలంలో ప్రతి పెద్ద సినిమా నిర్మాణ సంస్థ  చిత్రానికి వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు భారీగా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రకటనలు నిజంగా సినిమా నిర్మాణానికి పెట్టిన పెట్టుబడా లేక  హైప్ క్రియేట్ చేయడానికి వాడుతున్న మార్కెట్ వ్యూహమా? అనే సందేహాలు  విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఒక సినిమాకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పడం ద్వారా ఆ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరుగుతాయి. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్ , అంతర్జాతీయ స్థాయి సాంకేతికత ఉన్నాయనే నమ్మకాన్ని కలిగిస్తాయి. థియేట్రికల్ -ఓటీటీ బిజినెస్‌ను పెద్ద ఎత్తున క్లోజ్ చేయడానికి ఇదొక ప్రధాన మార్కెటింగ్ అస్త్రంగా మారింది.

నిజానికి ప్రకటించే బడ్జెట్‌లో సగానికి పైగా మొత్తం  హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్లకే సరిపోతుందనేది ఇండస్ట్రీ టాక్. 300 కోట్ల బడ్జెట్ అని ప్రకటించిన ఒక సినిమాలో  టాప్ స్టార్ -దర్శకుడి పారితోషికాలే 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు ఉండొచ్చు. మిగిలిన మొత్తాన్ని మాత్రమే సినిమా మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తారు. అంటే స్క్రీన్‌పై కనిపించే గ్రాండ్‌నెస్ కంటే కాగితాల మీద లీగల్ అగ్రిమెంట్లలో కనిపించే బడ్జెట్ గణాంకాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సినిమా బిజినెస్ రేంజ్ పెంచడం కోసం బడ్జెట్ అంకెలను కాస్త పెంచి చెప్పడం కూడా ఇండస్ట్రీలో  ఓపెన్ సీక్రెట్.

అయితే సైన్స్ ఫిక్షన్, మైథాలజీ , పీరియాడిక్ డ్రామా సినిమాలకు భారీ గ్రాఫిక్స్, భారీ సెట్స్ అవసరం కాబట్టి నిర్మాణ వ్యయం నిజంగానే ఎక్కువగా ఉంటుంది. సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్, వడ్డీల భారం కూడా బడ్జెట్‌ను పెంచేస్తాయి. కానీ  సాధారణ కమర్షియల్ సినిమాలకు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం వెనుక పూర్తిగా మార్కెట్ స్ట్రాటజీ మాత్రమే దాగి ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎందుకంటే నేటి డిజిటల్ యుగంలో లార్జర్ ద్యాన్ లైఫ్ అనే ఇమేజ్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. దీంతో  నిర్మాతలు ప్రకటించే వందల కోట్ల బడ్జెట్ అనేది పూర్తిగా సినిమా నిర్మాణ వ్యయం కాదు. అది సగం పెట్టుబడి. సగం పబ్లిసిటీ ప్లాన్ అని అర్థం చేసుకోవాలంటున్నారు.

Big Budget films marketing strategy