బ్లాక్ బస్టర్ చిత్రానికి భారీ ఊరట!
Finally A big relief for Dhurandhar 2 makers
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత ఆదిత్య ధర్‌కు చట్టపరంగా పెద్ద ఊరట లభించింది. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ధురంధర్ 2` చిత్రంపై దాఖలైన వివాదాస్పద పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కథా చౌర్యం (ప్లాజియరిజం) ఆరోపణలను తోసిపుచ్చుతూ ఈ సినిమా డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కాకుండా స్టే విధించాలంటూ వచ్చిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పుతో చిత్ర యూనిట్ ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ప్రధాన చట్టపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది.
వివాదం వివరాల్లోకి వెళితే..` చిత్రనిర్మాత సంతోష్ కుమార్ `ధురంధర్ 2` కథ తనదంటూ స్క్రిప్ట్ కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో కోర్టును ఆశ్రయించారు. సినిమా థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌ను కూడా నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇరువర్గాల వాదనలను సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం పిటిషనర్ సమర్పించిన ఆధారాలు బలహీనంగా ఉన్నాయని - ప్లాజియరిజం ఆరోపణలకు సరైన ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. సినిమా ప్రసార హక్కులు మరియు విడుదలను అడ్డుకోవడం సబబు కాదని పేర్కొంటూ ఆదిత్య ధర్ పక్షాన తీర్పునిచ్చింది.
ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో స్క్రిప్ట్ వివాదాలు, కాపీరైట్ క్లెయిమ్‌లు పెరిగిపోతున్న తరుణంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. లీగల్ చిక్కుల నుంచి విముక్తి లభించడంతో `ధురంధర్ 2` చిత్ర బృందం తదు పరి ప్రమోషన్స్ - డిజిటల్ రిలీజ్ పనులపై పూర్తి దృష్టి పెట్టేందుకు మార్గం సుగమమైంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ ఈ చట్టపరమైన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసింది.







































