మెగా లైనప్ లో కొత్త దర్శకులు!
New directors in Mega lineup!మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో పనిచేస్తూ తన లైనప్‌ను ఎంతో క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `కాకా` చిత్రం వేగంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ ఏది కాబోతోందనే దానిపై ఫిలింనగర్ వర్గాల్లో సస్పెన్స్ నెలకొంది. మెగా లైనప్‌లో కొత్త తరం ఆలోచనలున్న దర్శకులకు పెద్దపీట వేస్తుండటంతో తదుపరి చిత్రాన్ని ఎవరితో పట్టాలెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనులు మరికొంత సమయం తీసుకుంటుండటంతో శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి కనీసం మరో ఆరు నెలల సమయం పట్టేలా ఉంది. ఈ సుదీర్ఘ గ్యాప్‌ను వృథా చేయకుండా ఆలోపే మరో సినిమాను పూర్తి చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సానా లైన్‌లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా బుచ్చిబాబు వైవిధ్యమైన కథను సిద్ధం చేశారని, ఈ గ్యాప్‌లో వీరి కాంబినేషన్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
అయితే ఈ ఖాళీ సమయంలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం బుచ్చిబాబుతో పాటు మరో ఇద్దరు క్రేజీ దర్శకులు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చిరంజీవిని కలసి రెండున్నర గంటల పాటు కథ నెరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు `సోగ్గాడే చిన్ని నాయనా` ఫేమ్ కళ్యాణ్ కృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. ఇద్దరు దర్శకులు కూడా చిరును మెప్పించే సబ్జెక్టులతో రేసులో నిలిచారు. మరి ఈ రేసులో బుచ్చిబాబు నిలుస్తారా? ఆ ఇద్దరిలో ఎవరికైనా అవకాశం దక్కుతుందా? అన్నది తెలియాలంటే ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
















































