స్టార్ హీరో మాజీ భరణం తీసుకోలేదా?
Did Hrithik pay Rs 400 crore in alimony to Sussanne?బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- సుసానే ఖాన్ల విడాకులు తీసుకుని ఎవరి జీవితంలో వారు బిజీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హృతిక్ 400 కోట్లు భరణం చెల్లించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ ప్రచారంపైసుసానే సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ స్పందించారు. విడాకుల సమయంలో సుసానే హృతిక్ నుండి 400 కోట్ల భరణం తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. నెట్టింట ఈ ప్రచారం చూసి షాక్ అయ్యానన్నారు. తమ కుటుంబం సంపద కంటే బంధాలకే ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
సుసానే రూపాయి కూడా ఆశించకుండా ఎంతో హుందాగా ఆ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొందన్నారు. హృతిక్- సుసానేల విడాకుల నిర్ణయం అప్పట్లో ఇరు కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినా ఇద్దరు ప్రక్రియను ఎక్కడా వివాదాలకు తావులేకుండా ఎంతొ పరిణతితో ముగించారు. భరణం తీసుకోకపోవడం వల్లే నేటికీ సుసానేకు హృతిక్ -అతని తల్లిదండ్రులైన రాకేష్ రోషన్, పింకీ రోషన్లతో అద్భుతమైన అనుబంధం కొనసాగుతోందని ఫరా వెల్ల డించారు. మీడియాలో వచ్చే కథనాలకు భయపడి వాస్తవాలను నిరూపించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణిలోనే సుసానే పుకార్లను పెద్దగా పట్టించుకోలేదన్నారు.
ప్రస్తుతం హృతిక్- సుసానే వ్యక్తిగత జీవితాల్లో ముందడుగు వేసి వేర్వేరు భాగస్వాములతో సంతోషంగా ఉన్నారు. జీవితంలో సంతోషంగా ఉండటమే అన్నింటికంటే ముఖ్యమని నమ్మే తమ కుటుంబం, వారిద్దరి ప్రస్తుత బంధాలను పూర్తిగా గౌరవిస్తుందని ఫరా తెలిపారు. సెలబ్రిటీల విడాకులను కేవలం డబ్బు, ఆస్తుల కోణంలోనే చూసే సామాజిక దృక్పథాన్ని ఈ ఉదంతం ప్రశ్నిస్తోంది. బాహ్య ప్రపంచపు అంచనాలకు భిన్నంగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ విడిపోవడం కూడా సాధ్యమేనని ఈ మాజీ జంట నిరూపించింది.








































