టాలీవుడ్ వార్: నాగవంశీ వర్సెస్ నారంగ్

టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్లు - నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు వ్యక్తిగత సవాళ్ల స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఏషియన్ సునీల్ నారంగ్ తన వాట్సాప్ డీపీలో పెట్టిన శీర్షిక ఫిలిం నగర్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
``ఫైటింగ్ మొదట నువ్వే మొదలు పెట్టకు.. ఒకవేళ వారు నిన్ను బలవంతం చేస్తే మాత్రం పూర్తిగా నాశనం చేయ్!`` తన తండ్రి సూచించారనే అర్థంలో శీర్షిక ప్రత్యర్థి వర్గానికి బలమైన హెచ్చరికగా కనిపిస్తోంది. పర్సంటేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అద్దె విధానం కోసం పోరాడుతున్న నాగవంశీ, మైత్రి రవిశంకర్ వంటి నిర్మాతలు చేసిన విమర్శలకు కౌంటర్ గానే నారంగ్ ఈ `అంతం చేసే` ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. మల్టీప్లెక్స్‌లు కడుతూ సింగిల్ స్క్రీన్లను నాశనం చేస్తున్నారన్న నాగవంశీ ఆరోపణలను నారంగ్ ఇప్పటికే తిప్పికొట్టగా.. ఈ డీపీ వార్‌తో పోరు మరో స్థాయికి చేరింది.
తెలంగాణ ఎగ్జిబిటర్ల వెనుక సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి, దిల్ రాజు వంటి అగ్రజులు ఉండగా.. మైత్రి మూవీ మేకర్స్ - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పరిశ్రమకు సేవ చేసిన దిల్ రాజుకు మాట్లాడే హక్కు ఉంది కానీ నారంగ్‌కు లేదంటూ రవిశంకర్, నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత ఆజ్యం పోశాయి. ఇది కేవలం వ్యాపార పరమైన పర్సంటేజీ గొడవలా కాకుండా ఆధిపత్య పోరుగా మారి ఒకరిపై ఒకరు కక్ష సాధింపులకు దిగుతున్నట్లు కనిపిస్తోంది.
నారంగ్ అనుసరించబోతున్న ఈ తండ్రి గారి సూచన ఫార్ములా ఇండస్ట్రీలో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో... ఈ వివాదం చివరకు ఎక్కడ ముగుస్తుందోనన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. థియేటర్ల విషయంలో అద్దె విధానమా? పర్సంటేజీ విధానమా? అన్నది 15 మే సమావేశంలో సినీపెద్దలు తేల్చనున్నారని తెలుస్తోంది.







































