రేర్ వీడియో: తళా అజిత్ కుమార్తెతో విజయ్ ముచ్చట

దశాబ్దాలుగా కోలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న అగ్ర హీరోలు తళా అజిత్ ... దళపతి విజయ్ మధ్య ఉన్న అరుదైన స్నేహబంధాన్ని చాటిచెప్పే ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ వీడియోలో విజయ్ తన భార్య సంగీతతో కలిసి అజిత్-షాలిని దంపతుల ఈవెంట్‌కు హాజరై, వారి ముద్దుల కుమార్తె అనౌష్కను ఎత్తుకుని ఎంతో మురిపెంగా ఆటలాడించడం కనిపిస్తుంది.
అప్పటికి విజయ్ వయసు 30 ఏళ్లలోపే ఉంటుంది. ఈ వేడుకలో షాలిని.. సంగీత కూడా ఎంతో ఆత్మీయంగా కలిసి మెలిసి ఉండటం విశేషం. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉండటం, అజిత్ తన రేసింగ్ పట్ల మక్కువతో సినిమాలను పరిమితం చేయడంతో కోలీవుడ్ ఈ ఇద్దరు దిగ్గజాల కలయికను వెండితెరపై ఎంతో మిస్ అవుతోంది.
సోషల్ మీడియా వేదికగా అజిత్ వర్సెస్ విజయ్ అభిమానుల మధ్య తరచుగా `ఫ్యాన్ వార్స్` జరుగుతున్నా.. ఈ వీడియో ఆ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న అసలైన గౌరవాన్ని, సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తోంది. ఒకవైపు అజిత్ రేస్ కార్లలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంటే, మరోవైపు విజయ్ ఎంజీఆర్ - జయలలిత వంటి నేతల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బయటకు వచ్చిన ఈ త్రోబ్యాక్ వీడియో అగ్ర హీరోలు వ్యక్తిగతంగా ఎంతటి స్నేహభావంతో ఉండేవారో ప్రతిబింబిస్తూ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.








































