‘సోడ గోలీసోడ’ కు మంచి రెస్పాన్స్!
Soda Golisoda Releasedకథలో కంటెంట్ ఉంటే అది చిన్న హీరో సినిమానా, పెద్ద హీరో సినిమానా అనే తేడా లేకుండా విజయం అందిస్తారు టాలీవుడ్ ప్రేక్షకులు. అది ఇప్పటికే ఎన్నో చిత్రాల విషయంలో రుజువైంది. ప్రేక్షకులను మెప్పిస్తే చాలు విజయం గురించి ఇక ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడదే కంటెంట్‌ని నమ్ముకుని, కామెడీని జోడించి మంచి మెసేజ్‌తో వస్తున్నామని 'సోడ గోలీసోడ' యూనిట్ ప్రతి ప్రెస్‌మీట్‌లో తెలిపింది. వారు తెలిపినట్టే.. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్స్, ట్రైలర్ కూడా సినిమాలో విషయం ఉందనేలా అనిపించాయి. యంగ్ హీరో మానస్, నిత్యా నరేష్, కారుణ్య మొదలగువారు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలైంది. మరి ఈ చిత్రం గురించి యూనిట్ చెప్పింది నిజమో కాదో.. సినిమాలో కంటెంట్ ఉందో లేదో తెలియాలంటే ఈ సమీక్ష తిరగేయాల్సిందే.
పేర్వారం అనే గ్రామంలో దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేస్తుంటాడు శీను(మానస్). తన గ్యాంగ్‌తో కలిసి తన వృత్తిని చేసుకుంటున్న శీను ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురు రూప(నిత్యా)ని ప్రేమిస్తాడు. రూప కూడా ప్రేమిస్తుంది. అయితే శీను హైదరాబాద్ వచ్చి హీరోగా మారాలనుకుంటాడు. అందుకోసం హైదరాబాద్ రావడమే కాదు నిర్మాతగా కూడా మారి ఓ సినిమాని స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ సినిమా సగంలోనే ఆగిపోతుంది. అసలు శీను ఎందుకు హీరో అవ్వాలనుకున్నాడు. శీను హైదరాబాద్ వచ్చి హీరో అవడం వెనుక హీరోయిన్‌కి ఉన్న పాత్ర ఏమిటి? శీను చేయాలనుకున్న సినిమా సగంలోనే ఎందుకు ఆగిపోయింది. చివరికి నిత్యా, శీనుల వివాహం అయిందా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు మంచి కామెడీతో ఇచ్చిన సమాధానమే 'సోడ గోలీసోడ'.
హీరో మానస్ ఎనర్జీ లెవల్స్ బాగున్నాయి. మొదటి నుండి డ్యాన్సులతో అదరగొడుతున్న మానస్ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పాడు. హీరోగా, దొంగగా, ప్రేమికుడిగా వేరియేషన్స్ ఉన్న పాత్రలో మానస్ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో దక్కింది. కారుణ్య న్యాచురల్‌గా చక్కగా నటించింది. నిత్యా నరేష్ పాత్రను డైరెక్టర్ బాగా డిజైన్ చేశాడు. హీరోతో నిత్యా కెమెస్ట్రీ బాగుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో ఉన్నారు. అతికించినట్లు కాకుండా కామెడీ చేయడానికి వారికి సీన్స్ రాయడం మాములు విషయం కాదు. సినిమా డ్రాప్ అవుతుంది అనుకునే టైమ్‌లో కామెడీ పంచులతో నిలబెట్టేశారు కమెడియన్స్. అందరూ బాగా చేశారు. ఆలీ, షకలక శంకర్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, దువ్వాసి మోహన్, గౌతంరాజు, చమ్మక్ చంద్రలాంటి కమెడియన్స్ ఫస్టాఫ్ చూసుకుంటే.. సెకండాఫ్ బ్రహ్మానందం ఎంట్రీతో హాలులో ఈలలే ఈలలు.
దర్శకుడు హరిబాబు కొత్తవాడైనా చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రేక్షకులని కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. మంచి స్టోరీలైన్. ముఖ్యంగా యూత్‌ని టార్గెట్ చేశాడని అనిపించినా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రాన్ని హరిబాబు మలిచిన తీరు బాగుంది. కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్. నిజంగా అంతమంది కమెడియన్స్‌ని ఆయన మ్యానేజ్ చేసిన తీరుకి నిజంగా హరిని మెచ్చుకోవాల్సిందే. హీరోని దొంగని చేసి, ఆ దొంగని మళ్లీ హీరోని చేయడం ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌తో ఆయన అల్లుకున్న కథ కొత్తగా ఉంది. రెండు మూడు చోట్ల స్ర్కీన్‌ప్లే విషయంలో తడబడినా.. తొలి సినిమా డైరెక్టర్‌గా మాత్రం మంచి ప్రతిభ కనబరిచాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ వీక్‌గా ఉన్నప్పటికీ భరత్ సంగీతం ఓకే అనిపించింది. ముజీర్ మాలిక్ కెమెరా వేరియేషన్స్‌ని చక్కగా చూపించింది. మిగతా టెక్నీషియన్స్ అందరూ తమ ప్రయత్నం చేశారు. ఇక నిర్మాణ విలువలకు వస్తే భువనగిరి సత్య సింధూజ ఖర్చుకు వెనకాడకుండా భారీగా చిత్రాన్ని తెరకెక్కించారు. అంతమంది కమెడియన్స్‌ని ఎలా ఒప్పించగలిగారా? అనే అనుమానం ఈ సినిమా చూసిన వారికి రాకుండా ఉండదు. ఈ విషయంలో నిర్మాతను మెచ్చుకోవాల్సిందే. మొత్తంగా మాత్రం పేరుకే చిన్న సినిమా కానీ.. ఇందులో ఉన్న తారాగణం మాత్రం పెద్ద సినిమాని మరిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు.
Soda Golisoda Movie Review







































