నిర్మాతల మండలి ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితం
TFPC Elections: Mana Panel Scores Big Win
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాల అనంతరం నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. తమ `మన ప్యానెల్`ప్రత్యర్థి `ప్రోగ్రెసివ్ ప్యానెల్`పై ఘన విజయం సాధించి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ ఇప్పటికే కౌన్సిల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా.. ట్రెజరర్ పదవికి పోటీ పడిన రామకృష్ణ గౌడ్ శ్రీనివాసరావు విజయం సాధించారని తెలిపారు. అలాగే ప్రసన్న కుమార్ నేతృత్వంలోని `మన ప్యానెల్` అభ్యర్థులే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ప్రత్యర్థి వర్గమైన `ప్రోగ్రెసివ్ ప్యానెల్` నుంచి కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే గెలిచారని నట్టి కుమార్ చెప్పారు. అందులో ఒక వైస్ ప్రెసిడెంట్ (ఉపాధ్యక్షుడు) పదవితో పాటు ముగ్గురు ఈసీ మెంబర్లు మాత్రమే గెలిచారని, మిగిలిన ప్రధానమైన పదవులన్నీ తమ ప్యానెల్ అభ్యర్థులకే దక్కాయని వివరించారు. నిర్మాతల సంక్షేమం కోసం ప్రసన్న కుమార్, సీ. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకంతోనే సభ్యులందరూ ఓట్లేసి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. యాక్టివ్ నిర్మాతలు అంతా ఉన్న ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ పై దాదాపు 1245 మంది సభ్యులున్న మండలిలో మెజారిటీ నిర్మాతలకు వ్యతిరేకత ఉందని కూడా నట్టి కుమార్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.







































