పిఆర్ స్టంట్లతో సూపర్ స్టార్లు కాలేరు!

Ameesha Patel On PR StuntsAmeesha Patel On PR Stunts

 

బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ నేటి తరం హీరోయిన్లు ,చిత్ర పరిశ్రమలో పెరుగుతోన్న పిఆర్  సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకటి రెండు  సినిమాలు చేసినంత మాత్రాన ఎవరూ సూపర్ స్టార్లు కాలేరని ఎద్దేవా చేసింది. ఈ రోజుల్లో నటీమణులు  సినిమాల విజయం కంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ , పిఆర్ ఏజెన్సీల ద్వారా వచ్చే హైప్ పైనే ఎక్కువ ఆధారపడుతున్నారంది. ఇది పరిశ్రమకు మంచిది కాదని  అభిప్రాయపడింది. స్టార్‌డమ్ అనేది ప్రేక్షకుల గుండెల్లో సంపాదించుకోవాలే తప్ప కృత్రిమమైన ప్రచారంతో వచ్చేది కాదని  చురకలు అంటించింది.

తమ కాలంలో సినిమాలు ఎలా ఉండేవో? గుర్తు చేసుకుంది. `అప్పట్లో ప్రతిభకు , బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించే తిరుగులేని విజయాలకే ప్రాధాన్యత ఉండేదంది. నేటి హీరోయిన్లు  వ్యక్తిగత జీవితాలను, విమానాశ్రయ ప్రయా ణాలు, ప్రచారం చేసుకోవడానికి చూపిస్తున్న ఉత్సాహం నటనపై చూపించడం లేదని  విమర్శించింది.  పిఆర్ మేనేజ్మెంట్ ద్వారా సృష్టించుకునే ఇమేజ్ తాత్కాలికమేనంది. అది సుదీర్ఘ కెరీర్‌ను ఇవ్వలేదని హితవు పలికింది. `గదర్` వంటి ఇండస్ట్రీ హిట్లను చూసిన తమకు ప్రస్తుత పరిస్థితులు వింతగా అనిపిస్తున్నాయని  చెప్పుకొచ్చింది.

వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు ఇస్తేనే ప్రేక్షకులకు ఒక నటిపై నమ్మకం ఏర్పడుతుందని కానీ ప్రస్తుతం చిన్న విజయాలకే ఆకాశానికి ఎత్తేస్తున్నారని అమీషా అంటోంది. నటీమణులు తమ క్రాఫ్ట్ పై దృష్టి సారించి గుర్తుండిపోయే పాత్రలు చేయాలని  సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ , కామెంట్స్ నటి సామర్థ్యాన్ని నిర్ణయించలేవని స్పష్టం చేసింది. అమీషా చేసిన  వ్యాఖ్యలు బాలీవుడ్ యువ హీరోయిన్ల మధ్య చర్చకు దారితీశాయి. 

Ameesha Patel takes a dig at younger actresses and PR Stunts