పరిశ్రమల మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషించిన బ్యూటీ

దక్షిణాది-ఉత్తరాది సినిమాల్లో రాణించిన నటి సమీరా రెడ్డి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా? మచి అవకాశాలు వస్తే మాత్రం కాదనకుండా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు పరిశ్రమల మధ్య ఉన్న పనితీరు దృక్పథంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఉత్తరాది -దక్షిణాది సినీ వర్గాల మధ్య ఉండే వ్యత్యాసాలు కేవలం భాషకు మాత్రమే పరిమితం కాదన్నారు. వృత్తిపరమైన క్రమశిక్షణ సినిమాను చూసే విధానంలో కూడా స్పష్టమైన మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో టెక్నీషియన్లకు -నటీనటులకు ఇచ్చే గౌరవం ,పని సంస్కృతి తనను ఎంతో ప్రభావితం చేశాయని వివరించారు.
దక్షిణాదిలో సినిమా అంటే బాధ్యతగా భావిస్తారని షూటింగ్ సెట్స్‌లో ఉండే నిబద్ధత , సమయపాలన బాలీవుడ్‌తో పోలిస్తే అక్కడ చాలా ఎక్కువగా ఉంటుందని సమీరా అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ తరచుగా గ్లామర్ - షో-ఆఫ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని కానీ దక్షిణాదిలో కథాబలం , సహజత్వానికి పెద్దపీట వేస్తారని విశ్లేషించారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయని కంటెంట్ విషయంలో వారు చూపిస్తున్న స్పష్టత మిగిలిన వారిని ఆకర్షిస్తోందని చెప్పుకొచ్చారు.
మరోవైపు నటీమణుల పట్ల ఉండే దృక్పథంలో కూడా మార్పు రావాలని సమీరా కోరారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితం చేసినా? ఇప్పుడు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం శుభపరిణామమని అన్నారు. రెండు పరిశ్రమలలోనూ పని చేసిన అనుభవంతో చెబుతున్నానని ఎక్కడైనా ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే మనసు పెట్టి పనిచేసే వాతావరణం సౌత్ లో ఎక్కువగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.








































