వెంకీ గురించి ఓ కొత్త కబురు..!

ఇదివరకు వెంకటేష్ తనకు తగ్గ కథలు గురించి వెదుకులాడాల్సి వచ్చేది. ఎవ్వరూ సరైన కథలు తీసుకురాకపోవడంతో గత్యంతరం లేక రీమేక్‌లపై దృష్టిపెట్టేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వెంకీ కోసం బోలెడన్ని కథలు సిద్ధమవుతున్నాయి. నవతరం దర్శకులు పోటాపోటీగా కథలు వినిపిస్తున్నారు. కానీ వెంకీనే ఎటూ తేల్చుకోలేక ఆచితూచి అడుగేస్తున్నాడు. ఇదివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో కథలు రాకపోయినా సరే... యేడాదికి రెండు సినిమాలైనా చేసేవాడు. కానీ ఇప్పుడు అన్నేసి కథలొస్తున్నా ఆయన సినిమాని మొదలుపెట్టడం లేదు. పది నెలలుగా వెంకీ నుంచి సినిమానే రాలేదు. కనీసం ఆయన సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు. ఇప్పటికి ఇప్పుడు సినిమా మొదలుపెట్టినా అది ప్రేక్షకుల ముందుకొచ్చేసరికి ఏడెనిమిది నెలలు పడుతుంది.
వెంకీ చేయబోయే కొత్త చిత్రం గురించి కొంతకాలంగా రోజుకో రకమైన న్యూస్ వినిపిస్తోంది. తాజాగా వక్కంతం వంశీ కథని విన్న వెంకటేష్ ఆ సినిమా చేయడానికి ఒప్పుకొన్నట్టు సమాచారం. ఆ చిత్రాన్ని డాలీ తెరకెక్కించే అవకాశాలున్నాయట. వెంకీ చివరిగా డాలీతోనే సినిమా చేశాడు. ఇప్పుడు మరోసారి ఆయనతోనే చేయాలని డిసైడైపోయాడట. వెంకటేష్ కోసం చాలా మంది దర్శకులే కథలు సిద్ధం చేశారు కానీ... అవేవీ ఆయనకి నచ్చలేదట. అయితే ఇటీవల ఓ మాస్ స్టోరీతో వెళ్లిన వక్కంతం వంశీకి మాత్రం పచ్చజెండా ఊపేశాడట. ఆయనే దర్శకత్వం చేసినా ఓకే అన్నాడట. కానీ వంశీ తన తొలి చిత్రం ఎన్టీఆర్‌తోనే చేయాలని ఫిక్సయిపోయాడు. అందుకే ఆ కథని డాలీ చేతిలో పెట్టారని తెలుస్తోంది.







































