''భమ్ బోలేనాథ్" సినిమా రిలీజ్ కు సిద్ధం..!

ఆర్.సి.సి.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కార్తిక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'భమ్ బోలేనాథ్'. నిర్మాత శిరువూరి రాజేష్ వర్మ. ఈ చిత్రం ఫిబ్రవరి 14 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కార్తిక్ వర్మ మాట్లాడుతూ "డీసెంట్ హ్యూమర్ ఉన్న సినిమా ఇది. కథ, నేను సెలెక్ట్ చేసుకున్న నటీనటులు నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా నిర్మాత గారికి నా ధన్యవాదాలు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.
నిర్మాత రాజేష్ వర్మ మాట్లాడుతూ "కార్తికేయ సినిమాతో తెలుగు ప్రేక్షకాదరణ పొందాను. భిన్నంగా ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తారని 'భమ్ బోలేనాథ్' సినిమాను నిర్మించాను. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
హీరోగా నటించిన నవదీప్ మాట్లాడుతూ "ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఆడియో కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎక్స్టేన్సివ్ గా మూవీ ప్రమోషన్ చేస్తున్నాం. ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో కాలేజీ స్టూడెంట్స్ కి ట్రైలర్ చూపించినపుడు వాళ్ళంతా చాలా ఎక్సైట్ అయ్యారు. ఇప్పుడు మూవీ ప్రమోషన్ కోసం వైజాగ్, బెంగుళూరు కి వెళ్తాము" అని అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ "ఈ సినిమా టైటిల్ ట్రాక్ చాలా బాగా వచ్చింది. మంచి స్పందన కూడా లభించింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.
కమెడియన్ తాగుబోతు రమేష్ మాట్లాడుతూ "మూడు భిన్నమైన కథలతో సినిమా స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నా" అని అన్నారు.
నటుడు కిరీటి మాట్లాడుతూ "ప్రోమోస్, పోస్టర్స్ కి వచ్చిన స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనే అనుకుంటున్నా. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ. ఈ సినిమాలో కామెడీ హైలైట్ గా నిలుస్తుంది" అని అన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు: పూజ, పోసాని కృష్ణమురళి, పంకజ్ కేసరి, ప్రాచీ, శ్రేయ, ధనరాజ్, పృథ్వి, కాంచి, రజిత, మాధవి, జెమినీ సురేష్, ఫిష్ వెంకట్.
సాంకేతిక వర్గం: లిరిక్స్: కృష్ణ చైతన్య, బాలాజీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: భరణి కె ధరణి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తిక్, పి.ఆర్.ఓ. మాడూరి మధు.







































