జీవన సత్యాలు... చిన్నయ సూరి రచనలు -టి.డి.జనార్దన్
Chinnaya Suri's Ydhushyam Book Launch'తెలుగు' కోసం నేతల పిలుపు. ఘనంగా చిన్నయ సూరి వైదుష్యం గ్రంథావిష్కరణ -ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి.జనార్దన్.
తన రచనల ద్వారా ఎన్నో జీవన సత్యాలను బోధించడమే కాకుండా తెలుగు వ్యాకరణానికి క్రమబద్ధతను తీసుకువచ్చి తెలుగుజాతికి మహోపకారం చేసిన భాషాప్రేమికుడు పరవస్తు చిన్నయ సూరి అని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి.జనార్దన్ అన్నారు. సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ప్రధాన సంపాదకుడిగా రూపొందించిన ‘పరవస్తు చిన్నయ సూరి వైదుష్యం' గ్రంథావిష్కరణ కార్యక్రమం మండలి వేంకట కృష్ణారావు అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లి, అమరావతిలోని 'సంఘం' రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనార్దన్ మాట్లాడుతూ చిన్నయ సూరి రచనలు తెలుగు భాషను, సంస్కృతిని కాపాడి, భావితరాలకు అందించే వారసత్వ సంపదగా అభివర్ణించారు. మాతృభాషా పరిరక్షణ దిశగా యువతరంలో చైతన్యం కలిగించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
గ్రంథావిష్కరణ చేసిన కృష్ణా విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య ఎన్.ఉష మాట్లాడుతూ నీతిచంద్రిక రచన ద్వారా చిన్నయ సూరి తెలుగు జాతికి తరతరాల బంధువుగా నిలిచారన్నారు. భాషా పరిరక్షణ కోసం తమ విశ్వవిద్యాలయం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.త్రివిక్రమరావు మాట్లాడుతూ పాలనాభాషగా, బోధనభాషగా తెలుగును నూరుశాతం అమలుచేసేందుకు అధికార భాషా సంఘం చేస్తున్న కృషిని వివరించారు. తెలుగు భాషా వికాసానికి, వ్యాకరణ రంగానికి పరవస్తు చిన్నయ సూరి చేసిన సేవలు అజరామరమైనవని కొనియాడారు. వారి పాండిత్యాన్ని, వైదుష్యాన్ని నేటి తరానికి అందించేలా “చిన్నయ సూరి వైదుష్యం” జాతీయ సదస్సు పత్ర సంకలనాన్ని తీసుకురావడం అలాగే, దానిని మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం ఎంతో సముచితమైన పరిణామమని ప్రశంసించారు. చెన్నై తెలుగు అకాడమి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ తూమాటి సంజీవరావు మాట్లాడుతూ చిన్నయ సూరి వైదుష్యాన్ని యువతరానికి పరిచయం చేసి, ఆయన రచనల్ని అధ్యయనం చేసే దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ సామాజిక సేవకులు సూర్యదేవర మహేంద్రదేవ్, ఎస్.కె.వి.వి. హిందూ హైస్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డా. వి. నారాయణరావు, కే.బి.ఎన్. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. కృష్ణవేణి, చిన్నయ సూరి గ్రంథ ప్రధాన సంపాదకులు డా. కప్పగంతు రామకృష్ణ పాల్గొన్నారు.






































