లెనిన్ : సినీజోష్ రివ్యూ

Cinejosh Review: Lenin

చిత్రం: లెనిన్ (2026)
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ఈశ్వరి రావు, రాంకీ, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ తదితరులు.
దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సంగీతం: ఎస్.ఎస్. థమన్

అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ హైప్‌తో వ‌చ్చిన సినిమా- లెనిన్. కొన్ని ప‌రాజ‌యాల త‌ర్వాత అఖిల్ ఒక మంచి విజ‌యంతో అక్కినేని ఫ్యాన్స్ గ‌ర్వించేలా చేయాల‌నే క‌సితో చేసిన సినిమా ఇది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వ‌హించ‌గా, అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.  నేడు (10 జూలై 2026) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కినేని కుటుంబం స‌హా అభిమానులు ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందించిందా లేదా? అనేది తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

కథాంశం:
లెనిన్ (అఖిల్) అనే ఒక అనాథ చుట్టూ తిరిగే క‌థ ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో జయంతమ్మ (ఈశ్వరి రావు) కుటుంబానికి లెనిన్ దగ్గరవుతాడు. వ్యక్తిగత, రాజకీయ కక్షలతో నిండిన ఆ ఊరిలో ఆ కుటుంబంతో లెనిన్ ఏర్పరచుకున్న బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ క్రమంలో లెనిన్ జీవితంలోకి భారతి (భాగ్యశ్రీ బోర్సే) ప్ర‌వేశించాక క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? నీలకంఠం (రాంకీ), యతిరాజు (శివాజీ), ఎమ్‌ఎల్‌ఏ రాఘవరెడ్డి, కడప పోలీస్ పార్థసారథి (సునీల్) పాత్రలు కథను ఎలా నడిపించాయనేదే మిగిలిన సినిమా. మ‌హాభార‌తంలోని పాత్ర‌ల‌తో పోలిక ఉండేలా ఈ సినిమాలో పాత్ర‌ల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన తీరు అభినంద‌నీయం.

నటీనటుల పనితీరు:
తన మొదటి హిట్ కోసం శ్ర‌మించిన‌ట్టుగా రాజీ అన్న‌దే లేకుండా అఖిల్ చాలా కష్టపడ్డాడు. లుక్ పరంగా పూర్తిగా మారిపోయి క‌నిపించ‌డ‌మే కాకుండా.. ఎమోషనల్ సీన్లలో మంచి నటనను కనబరిచాడు. అలాగే భాగ్యశ్రీ బోర్సే తెరపై చాలా అందంగా కనిపించ‌డ‌మే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్ర‌లో ఆక‌ట్టుకుంది ప్రమోద్ పంజు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించగా.. ఈశ్వరి రావు, రాంకీ, శివాజీ, సునీల్, బ్రహ్మాజీలు తమ రొటీన్ ఫార్ములా పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

సాంకేతిక వర్గం:
`వినరో భాగ్యము విష్ణుకథ` ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరి మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ పల్లెటూరి నేపథ్యంలో ఈ ఇంటెన్స్ రివెంజ్ డ్రామాను ఎంచుకున్నాడు. ఫస్టాఫ్ అంతా పాత వాసనలు వచ్చే రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్లతో సాగడం మైనస్.  ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆసక్తిని రేకెత్తించినా బలహీనమైన పాత్ర‌ల చిత్ర‌ణ‌.. మిస్సయిన ఎమోషన్స్ వల్ల సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌పోయింది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు ఓకే అనిపిస్తాయి. థమన్ అందించిన పాటల్లో `వారేవా వారేవా` మినహా ఏవీ పెద్దగా రిజిస్టర్ కావు. పాటలు కథనానికి స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. అయితే తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. లియోన్ బ్రిట్టో విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా చూపించాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్లు:
* అఖిల్ మేకోవర్, నటన
* థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:
* పండని ఎమోషన్స్
* రొటీన్ పాటలు
* బలహీనమైన పాత్ర‌ల చిత్ర‌ణ‌

చివరిగా :
`లెనిన్` ఒక పాతకాలపు ఫార్ములాతో సాగే కమర్షియల్ డ్రామా. అఖిల్ తన వంతుగా ఎంత కష్టపడినా, దర్శకుడు స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అందులో స్ట్రీమింగ్ కానుంది.

పంచ్‌లైన్: లెనిన్ - అఖిల్ కోసం మాత్రమే!
రేటింగ్: 2.5 / 5
 

Lenin Movie Review