సినీజోష్ ఇంటర్వ్యూ-సుమంత్ అశ్విన్

సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీ కృష్ణ నిర్మిస్తోన్న చిత్రం 'రైట్ రైట్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
గుర్తుండిపోయే పాత్ర...
ఈ సినిమాలో ఓ బస్ కండక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి రోల్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. క్లిక్ అయితే మంచి పేరొస్తుంది. పైగా ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే పాత్రలు. మొదట కండక్టర్ రోల్ అనగానే రజినీకాంత్ గారు గుర్తొచ్చారు. కాని ఆయన స్టైల్ వేరు. ఈ సినిమా కోసం నేను మోహన్ లాల్ గారు ముప్పై ఏళ్ళ క్రితం నటించిన ఓ సినిమాను రిఫరెన్స్ గా తీసుకున్నాను. అయితే అందులో మోహన్ లాల్ గారు ఓ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారు. ఆయనలా కనిపించడానికి ప్రయత్నించాను. అలానే బయట కండక్టర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు..? వాళ్ళ బాడీలాంగ్వేజ్, నడక ఇలా ప్రతి ఒక్కటి గమనించాను.
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా..
ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ మధ్య కొత్త సబ్జెక్ట్స్ తో వస్తోన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే నమ్మకంతో ఉన్నాం.
పాజిటివ్ పాత్రలో కనిపిస్తారు..
ఈ సినిమాలో కాలకేయ ప్రభాకర్ ఓ పాజిటివ్ పాత్రలో కనిపిస్తారు. మా కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. సినిమాలో శ్రీహరి గారు అన్న పాత్రలో కనిపించడం ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందో.. బాహుబలి సినిమా తరువాత భయంకరమైన విలన్ రోల్ నుండి ఓ పాజిటివ్ రోల్ లో ప్రభాకర్ కనిపించడం అంతే ఫ్రెష్ గా అనిపిస్తుంది.
విలేజ్ లో జరిగే కథ..
పోలీస్ అవ్వాలనుకొని కండక్టర్ అయిన ఓ వ్యక్తి ఎస్.కోట నుండి గవిటి అనే ప్రాంతానికి ట్రావెల్ చేసే బస్ లో పని చేస్తుంటాడు. గవిటి అనే రిమోట్ విలేజ్ లో జరిగే కథ. సినిమా ఎక్కువ భాగం విలేజ్ లోనే ఉంటుంది. అక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ తో కండక్టర్, డ్రైవర్ జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయనేదే సినిమా.
మొదట వర్కవుట్ కాలేదు..
ఈ సినిమా కథ డ్రైవర్, కండక్టర్ మధ్య జరుగుతుంటుంది. మొదటిరోజు ప్రభాకర్ కు నాకు మధ్య బాండ్ సరిగ్గా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత సెట్స్ లోనే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఆ తరువాత నుండి మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
కొన్ని మార్పులే చేశాం..
ఈ సినిమా ఒరిజినల్ తో పోలిస్తే కొన్ని మార్పులు చేశాం. మొదటి భాగం నిడివి తగ్గించి తెలుగుకు తగ్గట్లుగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. సెకండ్ హాఫ్ లో మాత్రం మార్పులు చేయడానికి ఎటువంటి స్కోప్ లేదు.
నాన్న చెప్పిందే జరుగుతుంది..
నా సినిమా రిజల్ట్ విషయంలో నాన్నగారు ఏది చెప్తే అదే కరెక్ట్ అవుతుంది. కేరింత, లవర్స్ సినిమాలు బావున్నాయని చెప్పారు. నిజంగానే ఆ సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి. చక్కిలిగింత సినిమా మాత్రం బాలేదని చెప్పేశారు. ప్రేక్షకుల నుండి కూడా అదే రిజల్ట్ వచ్చింది. ఈ సినిమా చూసి మాత్రం క్లైమాక్స్ చాలా బావుందని చెప్పారు.
కొత్త డైరెక్టర్ అయినా.. నమ్మకం ఉంది..
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మను కొత్త వారైనా.. మా అందరికి తన మీద చాలా నమ్మకం ఉంది. పెద్ద డైరెక్టర్స్ దగ్గర కో డైరెక్టర్ గా పని చేశారు. ఆయనతో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్...
రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రొడ్యూసర్స్ ఆ విషయాన్ని వెల్లడిస్తే బావుంటుంది అని ఇంటర్వ్యూ ముగించారు.







































