కింగ్ నుంచి అనిరుధ్ అవుట్

Anirudh’s Exit from SRK’s KingAnirudh’s Exit from SRK’s King

బాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న `కింగ్` ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తారని ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుండి అనిరుధ్ తప్పుకోవడం.. ఆయన స్థానంలో సచిన్-జిగర్ ద్వయం ప్రాజెక్ట్‌లోకి రావడం  సినీ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది.   అనిరుధ్ వైదొలగడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత జీవితానికి ముఖ్యంగా  పెళ్లి వార్తలకు ముడిపడి ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో అనిరుధ్ వివాహం త్వరలోనే జరగనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో పెళ్లి పనుల నిమిత్తమే అనిరుద్ సినిమాను వదులుకున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పరిశ్రమ వర్గాల ఏమంటున్నాయంటే? పెళ్లి వార్తలే ఈ నిర్ణయానికి ఏకైక  కారణం కాకపోవచ్చని అంటున్నారు. అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడానికి అసలు సిసలైన కారణం ఆయన బిజీ వర్క్ షెడ్యూల్ ప్రాథమిక సమాచారం.

ప్రస్తుతం అనిరుధ్ చేతిలో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అరడజనుకు పైగా పాన్-ఇండియా బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్‌కి తగినంత సమయం కేటాయించాల్సి రావడం, రీ-రికార్డింగ్ పనుల్లో ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే  కుదరని డేట్ల సమస్య  వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వ‌స్తున్నాయి.  మరోవైపు షారుక్ ఖాన్ `కింగ్` సినిమా మేకర్స్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అనుకున్న సమయానికి సంగీతాన్ని .. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదనే ప్రొడక్షన్ ఒత్తిడి కూడా ఉండి ఉంటుంది.

అనిరుధ్  నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడకుండా ఉండటానికి.. మల్టీ టాస్కింగ్ కంటే ఒకేసారి పరిమిత ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమే ఉత్తమమని భావించి ఉండొచ్చు. అయితే షారుక్ ఖాన్‌తో ఉన్న  అనుబంధం దృష్ట్యా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ఖాళీ చేతులతో వీడలేదు. సినిమా కోసం ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన పవర్‌ఫుల్ థీమ్ ట్రాక్‌ను ప్రొడక్షన్ హౌస్‌కు బహుమతిగా  అందించినట్లు తెలుస్తోంది. ఇది వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన గౌరవాన్ని.. సత్సంబంధాలను ప్రతిబింబిస్తోంది.
 

Anirudh apparently exits King