రాధికా ఆప్టే ఇంటి వెనుక ఎమోషనల్ స్టోరీ
Radhika Apte's Mumbai home: Inside the eclectic house
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ముంబైలోని తన ఇల్లు.. ప్రత్యేకతల గురించి పంచుకున్న వివరాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పుణే నుంచి ముంబైకి వచ్చి నటిగా నిలదొక్కుకునే క్రమంలో రాధిక భర్త, బ్రిటీష్ సంగీత విద్వాంసుడు బెనెడిక్ట్ టేలర్ ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని తెలిపారు. వెలుతురు ధారాళంగా వచ్చేలా ఎత్తైన సీలింగ్‌లు, పచ్చని మొక్కలు, పాతకాలపు వింటేజ్ శైలి , ఆధునిక ఫర్నిచర్ల కలయికతో ఇల్లు రూపుదిద్దుకుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రశాంతతను ఇచ్చేలా సహజమైన సూర్యకాంతి పడే గృహాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని రాధిక పేర్కొన్నారు.
రాధికా ఆప్టే ఇంటీరియర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణ వివిధ రంగుల్లో ఉండే తలుపులు. పాఠశాలలో తన ఉపాధ్యాయురాలు ఫ్యాన్లకు రకరకాల రంగులు వేయడం చూసి ప్రేరణ పొందిన రాధిక, తన ఇంటి తలుపులకు ఒక్కో దానికి ఒక్కో రంగు వేయడం మొదలుపెట్టారు. అలాగే ఇంట్లో వస్తువులు .. కుటుంబ జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నాయి. తన సొంత సంపాదనతో చేయించిన ఓ ప్రత్యేకమైన కుర్చీ ఆమె తల్లికి ఎంతో ఇష్టమైన ప్రదేశం కాగా, నానమ్మ , తల్లిదండ్రుల నుంచి లభించిన పాతకాలపు చిన్న చిన్న ఫర్నిచర్ వస్తువులు రాధికకు ఎంతో అమూల్యమైనవిగా నిలిచాయి.
ఇంట్లో రాధికకు అత్యంత ఇష్టమైన ప్రాంతం బాల్కనీ. హాలులోకి అనుసంధానించిన ఈ బాల్కనీ నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ రాత్రి వేళల్లో .. వర్షాకాలంలో కప్పు టీ తాగుతూ గడపడం ఆమెకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇటీవల రాధికా ఆప్టే ఆడపిల్లకు జన్మనిచ్చి మాతృత్వాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. ఆ రకంగా రాధిక ముంబై నివాసం ఒక ఇల్లు మాత్రమే కాకుండా ఆమె ప్రయాణాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వేదికగా నిలుస్తోంది.
















































