గణేష్ చతుర్థి వేడుకలకు దూరంగా ఊర్మిళ!
Urmila Matondkar misses Mumbai's Ganpati Celebrations
బాలీవుడ్ నటి ఊర్మిళా మాటోండ్కర్ గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రతి ఏటా వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఊర్మిళ ఈసారి ముంబైలోని గణపతి పండల్స్‌ను దర్శించుకోవడానికి -స్వామివారి దర్శనం చేసుకోవడానికి దూరంగా ఉండాల్సి వస్తోందని వెల్లడించారు. ముంబై నగరంలో సందడిగా సాగే ఉత్సవాలను ప్రత్యక్షంగా అనుభవిం చలేకపో తున్నందుకు విచారం వ్యక్తం చేశారు.
తన ప్రయాణాల వల్లే పండుగ సమయంలో ముంబైలో ఉండలేకపోతున్నానని ఊర్మిళా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో గణపతి పండల్‌లో దిగిన పాత జ్ఞాపకాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ ఫోటోలో ఆమె నారింజ రంగు పట్టు చీర ధరించి.. నమస్కరిస్తూ గణేష్ భగవానుడి ఆశీస్సులు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఈ పోస్ట్ ద్వారా పండుగ వాతావరణాన్ని, పండల్స్ దర్శనాన్ని ఎంతగానో మిస్ అవుతున్నానన్నారు.
అలాగే ఈసారి గణపతి బప్పాను పెద్ద కోరికల జాబితా ఏమీ అడగడం లేదని రాసుకొచ్చారు. `ప్రజలందరినీ సురక్షితంగా ఉంచు. వారి ముఖాల్లో నవ్వులు నింపు. ఇతరులతో చెప్పుకోలేని కష్టమైన రోజులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. జీవితం సవాలుగా మారినప్పుడు వారు ఒంటరి కాదు అనే విషయాన్ని గుర్తుచేయి` అని ఊర్మిళా దేవుడిని ప్రార్థించారు.
















































