ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Gopal Varma stunner about Censor Board

సెన్సార్ బోర్డ్‌ని బ్యాన్ చేయాల‌న్న ఆర్జీవీ

Ram Gopal Varma stunner about Censor Board

చిత్ర పరిశ్రమలో తన సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ప్రస్తుత సెన్సార్ విధానంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమాలకు సెన్సార్‌ చేయడం అనేది ప్రేక్షకులను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ.. సెన్సార్ బోర్డ్‌ను పూర్తిగా నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్‌ఫోన్‌లు, గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు.. అనంతమైన సమాచార సాంకేతికత అందుబాటులో ఉన్న నేటి ఆధునిక యుగంలో కూడా, ప్రభుత్వ కమిటీలు వయోజనుల ఆలోచనలను శాసించాలనుకోవడం అత్యంత హాస్యాస్పదమని ఆయన తన `ఎక్స్` (ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు. అసలు ఈ కమిటీ సభ్యుల అర్హత ఏమిటని ప్రశ్నించిన ఆర్జీవీ దర్శకుడి కోణంలో ఆవిష్కరించే నిజాన్ని అడ్డుకోవడం కేవలం కాలం చెల్లిన పద్ధతి మాత్రమే కాదు.. ఒక ముూర్ఖత్వమని మండిపడ్డారు.

ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ వెనుక ఉన్న అసలైన ద్వంద్వ నీతిని వర్మ ఎండగట్టారు. దేశ భవిష్యత్తును మార్చే నాయకుడిని ఎన్నుకోవడానికి, వ్యాపారాలను నడపడానికి, కుటుంబాలను పోషించడానికి ఒక ఓటరుకు ఉన్న మెచ్యూరిటీని నమ్మే ప్రభుత్వాలు, కేవలం ఒక సినిమా సీన్ వారిని పాడుచేస్తుందని భావించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఓటు హక్కు ద్వారా సమాజ భవిష్యత్తును నిర్దేశించే పౌరులను బాధ్యతాయుతమైన వ్యక్తులుగా చూడకుండా.. థియేటర్లో ఒక బూతు మాట వింటే పాడైపోయే చిన్న పిల్లల్లా పరిగణించడం సమాజాన్ని రక్షించడం కాదని.. వారిని మానసికంగా ఎదగనివ్వకుండా చేయడమేనని వర్మ విమర్శించారు.

సినిమా అనేది ఒక దర్శకుడి వ్యక్తిగత ఆలోచనల నుండి పుట్టే ఒక డ్రామా అని... దానిని అంగీకరించాలా లేదా అనేది పూర్తిగా ప్రేక్షకుల ఇష్టమని ఆర్జీవీ స్పష్టం చేశారు. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) - ఇంటర్నెట్ ప్రపంచంలో ఇలాంటి ఆంక్షలు విధించడం కేవలం ఒక జోక్ లాంటిదన్నారు. థియేటర్ విడుదలలో ఒక సీన్ కట్ చేసినంత మాత్రాన కంటెంట్ ఆగిపోదని, అది విడుదలైన కొన్ని గంటల్లోనే టోరెంట్స్, టెలిగ్రామ్ వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లలో అన్‌కట్ వెర్షన్‌గా ప్రత్యక్షమవుతుందని గుర్తుచేశారు. ఇందుకు ఉదాహరణగా ఆయన తన `అబ్సెషన్` చిత్రంలోని హెడ్-బ్యాంగింగ్ సీన్‌ను ప్రస్తావిస్తూ.. సెన్సార్ కట్ చేసిన తర్వాత ఆ సీన్‌ను థియేటర్లలో కంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పదిరెట్లు ఎక్కువ మంది వీక్షించారని తెలిపారు.

భాష, హింస, శృంగారం లేదా సిద్ధాంతాల పేరుతో బలవంతంగా సినిమాలను కత్తిరించడం వల్ల సినిమా రంగం ఒక కపటత్వానికి వేదికగా మారుతుందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో భీకరమైన వార్తలను, తీవ్రమైన దృశ్యాలను విచ్చలవిడిగా చూస్తున్నప్పుడు.. కేవలం సినిమా పరంగా వచ్చే కొన్ని క్షణాలపైనే ఆంక్షలు ఎందుకు విధిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన స్వేచ్ఛాయుత చర్చలకు సినిమా కూడా ఒక ప్రతిబింబంగా నిలవాలని.. అయితే సెన్సార్ బోర్డ్ మాత్రం ప్రేక్షకులకు ఒక తండ్రిలా నీతులు చెప్పాలని చూస్తోందని విమర్శించారు. చిత్ర పరిశ్రమకు కావాల్సింది కత్తెర్లు కాదని, సినిమాలో ఏముందో ముందే స్పష్టంగా చెప్పి.. చూడాలో లేదో నిర్ణయించుకునే హక్కును ప్రేక్షకులకే వదిలేసే గౌరవప్రదమైన వ్యవస్థ రావాలని ఆయన కోరారు.

కళ గురించి, ప్రేక్షకుల గురించి కనీస అవగాహన లేని బ్యూరోక్రసీ (అధికార యంత్రాంగం) ముందు సినిమా నిర్మాతలు, దర్శకులు మోకాళ్లపై మోకరిల్లడం ఆపాలని ఆర్జీవీ పిలుపునిచ్చారు. ఇండస్ట్రీ ప్రతిసారీ వివాదాలు ఎందుకులే అని రాజీపడటం లేదా సెల్ఫ్-సెన్సార్ చేసుకోవడం వల్ల ఈ గేట్‌కీపర్ల అహాన్ని మరింత పెంచి, చిత్ర పరిశ్రమను ఒక సాఫ్ట్ టార్గెట్‌గా మారుస్తున్నామని హెచ్చరించారు. అందుకే కోర్టుల్లోనూ, ప్రజా వేదికల్లోనూ ఈ సెన్సార్ బోర్డ్ ఉనికిని సవాలు చేయడానికి ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కనెక్ట్ అయి ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో సినిమాను ఒంటరిని చేసి హింసించడం అంటే మన ఎదుగుదలను మనమే ఆత్మాహుతి చేసుకోవడమేనని పేర్కొంటూ #బ్యాన్ ది సెన్సార్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన నిరసనను ముగించారు.

RGV stunner about Censor Board