వైభవంగా మొదలైన టీడీపీ మహానాడు
TDP Mahanadu
ప్రతి ఏడాది టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది కూడా వైభవంగా మొదలైంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ మహానాడు ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. ఎప్పుడు మాదిరి కాకుండా ఈసారి సరికొత్త హంగులతో టెక్నాలజీని జోడించి టిడిపి శ్రేణులు మహానాడును నిర్వహిస్తున్నారు. ఇంధన పొదుపు చర్యలతో పాటు రవాణా ఖర్చులను తగ్గించుకునే వ్యూహాత్మక ఆలోచనతో, పార్టీ అధిష్ఠానం ఈ ఏడాది మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తోంది.
దానికోసం ఇప్పటికే రెండు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ క్లస్టర్ల వారీగా వర్చువల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ వేడుకల్లో నేరుగా భాగస్వామ్యులయ్యేలా వినూత్న ఏర్పాట్లు చేశారు. వేసవి తాపం దృశ్య ప్రతి జిల్లాలో ఏసీ కల్యాణ మండపాలలో ఈ మహానాడును ఘనంగా నిర్వహించనున్నారు.
పార్టీ శ్రేణులను ఒకే తాటిపైకి తెస్తూ డిజిటల్ విప్లవంతో నిర్వహిస్తున్న ఈ మహానాడు పట్ల టీడీపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ఈ మహానాడు వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక టిడిపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అందుకున్న మంత్రి నారా లోకేష్ నేడు మహానాడులో కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి తన మొదటి స్పీచ్ ఇవ్వబోతున్నారు.







































