`పెద్ది`ని ఆపితే ఆమరణనిరాహార దీక్ష!
Peddi Release Row Natti Kumar Warns of Hunger Strike Over Exhibitorsమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `పెద్ది` చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ చిత్ర విడుదల సజావుగానే సాగుతున్నా? తెలంగాణలో మాత్రం థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్ల) పర్సంటేజీ వివాదం కారణంగా కొంత గందరగోళం ఏర్పడింది. సినిమా విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ చిత్రానికి పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబట్టడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. `పెద్ది` సినిమా విడుదలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని బుధవారం ఉదయం నుండి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సంచలన హెచ్చరిక చేశారు. చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే సినిమాను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భారీ బడ్జెట్‌తో, ఎంతోమంది శ్రమతో రూపొందిన క్రేజీ ప్రాజెక్టును ఇలాంటి వివాదాలతో అడ్డుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
గతంలో మహేష్ , అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు లేని ఇబ్బందులు నిబంధనలు ఇప్పుడు `పెద్ది` సినిమాకే ఎందుకు వర్తింపజేస్తున్నారని నట్టి కుమార్ ప్రశ్నించారు. పరిశ్రమలో ఉండే ఆ నలుగురు పెద్దలు వెనకుండి నడిపిస్తున్న రాజకీయాలకు ఇతరులు బలికావద్దని పిలుపునిచ్చారు. చలనచిత్ర రంగం బాగుండాలన్నా? థియేటర్లలో మళ్లీ పండగ వాతావరణం నెలకొనాలన్నా ? ఇలాంటి అనవసర వివాదాలకు స్వస్తి చెప్పి సినిమా సజావుగా విడుదలయ్యేలా సహకరించాలని నట్టి కుమార్ కోరారు.







































