అనుష్క ఏం మారలేదుగా..!

No Change in Anushka Size

'పిల్లజమీందార్‌' ఫేమ్‌ జి.అశోక్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బేనర్‌లో రూపొందుతున్న 'భాగమతి' కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అనుష్క అభిమానులు. మరోవైపు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో అనుష్క నాజూకుగా, ఏదో జీసస్‌ని పోలిన గెటప్‌లో కనిపిస్తూ ఉండటంతో ఇది ఓ ఫాంటసీ చిత్రమని, ఇందులో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ దర్శకుడు అశోక్‌ మాత్రం వాటిని కొట్టిపారేశాడు. ఇది ఫాంటసీ స్టోరీ కాదు.. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం లేదు, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో, థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం అనుష్కకి ఓ 'అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి'లా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. ఇక ఈ చిత్రం కథని 'బాహుబలి'కి ముందే చెప్పాను. కానీ 'బాహుబలి, లింగా' చిత్రాలతో అప్పుడు అనుష్క బిజీగా ఉండటంతో లేటయింది. ఇక 'సైజ్‌జీరో' తర్వాత ఆమె బొద్దుగా తయారు కావడం కూడా ఆలస్యానికి కారణమైందని చెప్పాడు. 

ఇక 'సైజ్‌జీరో'తో బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత సన్నబడలేక 'ఓం నమోవేంకటేశాయ, సింగం3'లలో తన ఫిజిక్‌తో విమర్శల పాలైంది. కానీ రాజమౌళి ఆమెను తిట్టి ఇక తప్పదని భావించి ఓ చిన్న చిత్రానికి సరిపడా బడ్జెట్‌ని కేటాయించి, గ్రాఫిక్స్‌ పుణ్యాన నాజూకుగా చూపించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో కూడా ఆమె బొద్దుగానే కనిపించింది. ఇక తాజాగా 'భాగమతి' ఫస్ట్‌లుక్‌లో కూడా అనుష్క నాజూకుగా ఉండటంతో ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు. 

కానీ ఈ లుక్‌ కూడా గ్రాఫిక్స్‌ మాయాజాలమే అని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌లో అనుష్క ప్రముఖ లేడీ కమెడియన్‌ విద్యుల్లేఖరామన్‌తో ఓ ఫోటో దిగింది. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో అనుష్క ఇంకా బొద్దుగానే కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనుష్కని నాజూకుగా చూపించడానికి ఏకంగా నిర్మాతలు ఐదుకోట్లు ఖర్చుచేసి ముంబైలోని గ్రాఫిక్‌ నిపుణుల చేత నాజూకుగా చూపించారని తెలుస్తోంది.

Vidyullekha Raman posted Bhaagamathie On location Pic

bhaagamathie
anushka
vidyullekha raman
anushka size