కేజీ బంగారం వెనుక రీజన్ అదేనా?

కొన్ని సినిమాలకు నిర్మాణ దశ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని సినిమాలను ఆడియో ఫంక్షన్ నుంచి ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. ఈమధ్యకాలంలో సినిమాకి ప్రమోషన్ అనేది చాలా అవసరంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా నిర్మాణం ఒక ఎత్తు, ఆ సినిమాని సక్రమంగా ప్రమోట్ చెయ్యడం ఒక ఎత్తు. రకరకాల ప్రమోషన్స్‌తో జనాన్ని థియేటర్‌కి రప్పించడానికి దర్శకనిర్మాతలు నానా తంటాలు పడుతుంటారు. ఇదంతా ఓకే. తమ సినిమా మీద ఏమాత్రం డౌట్ వున్నా ఎట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టడం ద్వారా థియేటర్‌కి జనాన్ని రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి.
ఇప్పుడు సైజ్ జీరో చిత్రానికి కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు నార్మల్‌గానే ప్రమోట్ చేస్తూ వస్తున్న నిర్మాత సడన్‌గా ఈ సినిమాని థియేటర్‌కి వచ్చి చూస్తే 1 కేజీ బంగారం గెలుచుకునే అవకాశం వుంటుందని ప్రకటించాడు. పైరసీని అరికట్టి ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్‌ని స్టార్ట్ చేస్తున్నట్టు నిర్మాత చెప్తున్నప్పటికీ కేజీ బంగారం స్కీమ్ అనేసరికి సినిమా మీద రకరకాల డౌట్స్ వస్తున్నాయి. సినిమా బాగా రాలేదనీ, సినిమాలో విషయం లేదనీ, అందుకే ఇలాంటి స్కీమ్స్‌తో జనాన్ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ చిత్రాల్లో నటించిన అనుష్క నటించిన ఈ సినిమాకి ఇలాంటి స్కీమ్స్ అవసరమా? అని కొంతమంది వాదన. ఇప్పటివరకు ఈ సినిమా మీద ఎంతో కొంత క్రేజ్ వుంది. అది ఈ స్కీమ్‌తో మటు మాయం అయిందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.







































