వ్యాపారంలోకి దిగుతున్న బొద్దుగుమ్మ..!!

బొద్దుగుంటేనే ముద్దు అని నమ్మిన నమిత ఇప్పుడు వెండితెరపై కనిపించకుండా పోయింది. తెలుగులో 'సొంతం' సినిమాతో యువకల కలల రాణిగా వెలుగొందిన నమిత ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమె హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఒకానొకదశలో తమిళంలో అగ్రకథానాయికగా వెలుగొందిన నమిత అవకాశాలపరంగా రేసులో పూర్తిగా వెనుకబడిపోయింది. తమిళంలో అగ్రకథానాయకుల సరసన నటించిన ఈ హీరోయిన్‌కు ఇప్పుడు అక్కడ అవకాశాలే లేకుండాపోయాయి. దాదాపు ఆమె నటించిన సినిమా విడుదలై రెండేళ్లు కావస్తోంది. దీంతో ఇక సినిమాలను పూర్తిగా పక్కకు పెట్టేయాలన్న ఆలోచనకు వచ్చిన నమిత హోటల్స్, రెస్టారెంట్ల బిజినెస్‌ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాపారం గురించి కొన్నాళ్లుగా ఆమె తీరిక లేకుండా కష్టపడుతున్నట్లు నమిత సన్నిహితులు చెబుతున్నారు. అయితే నమిత హోటల్స్ బిజినెస్‌లోకి రావడం ఇష్టంలేని ఆమె కుటుంబ సభ్యులు వారసత్వంగా వస్తున్న జ్యువెలర్స్ వ్యాపారం ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారట. మరి నమిత జ్యువెలరీ బిజినెస్‌ను ప్రారంభిస్తుందో లేక రెస్టారెంట్లవైపే మొగ్గుచూపుతుందో వేచిచూడాలి.







































