డిమాండ్: జర్నలిస్ట్ ప్రభు బహిరంగ లేఖ
Journalist Prabhu Demandsతెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులకు, తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారికి మరియు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సభ్యులకు.. జర్నలిస్ట్ ప్రభు బహిరంగ లేఖ:
ఒక ఫిలిం జర్నలిస్టుగా తెలుగు చలన చిత్ర రంగంతో నాకున్న 33 ఏళ్ల అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమ స్వరాష్ట్రానికి తరలి వచ్చే సమయంలో ఉదయం, శివరంజని పత్రికల రిపోర్టర్ గా నేను రాసిన నిర్మాణాత్మకమైన రాతల గురించి మీకు తెలుసు.
పరిశ్రమ ఇక్కడకు తరలి వచ్చిన తరువాత 24 శాఖల లోని బాలారిష్టాలను, కష్ట నష్టాలను వివరిస్తూ నేను రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు ఇక్కడ పరిశ్రమ స్థిరీకరణకు దోహదపడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు.
కాగా ఫిలిం జర్నలిస్ట్ ను కాక ముందు నేను శతాధిక చిత్ర దర్శకులు కీ .శే. దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణరావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అర్హతతో 2007లో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యుడిని అయ్యాను.
అదే అర్హతతో నవంబర్ 14న జరిగిన డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేశాను. కానీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కె వి ఆర్ చౌదరి గారు నా నామినేషన్ ను ఇన్వాలిడ్ గా ప్రకటించారు. నేను ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నందున డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిని అన్నది ఆయన నాకు ఇచ్చిన సమాధానం.
అయితే వాస్తవానికి అలాంటి నిబంధన ఏదీ డైరెక్టర్స్ అసోసియేషన్ బై లాస్ లో గానీ, మినిట్స్ లో గానీ లేనేలేదు. అసలు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లోని 24 శాఖల సమాఖ్యకు ఎలాంటి సంబంధం లేదు అన్న వాస్తవం తెలిసి కూడా అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా కె వి ఆర్ చౌదరి నా నామినేషన్ ను బుట్ట దాఖలా చేశారు.
ఈ సందర్భంగా గమనార్హమైన వాస్తవం ఏమిటంటే.. ఒక అసోసియేషన్ పదవిలో ఉన్నవారు మరొక అసోసియేషన్ పదవిలో ఉండకూడదు అన్న నిబంధనలో ఏమాత్రం స్పష్టత గానీ, అందుకు లిఖిత పూర్వకమైన ఆధారాలు గాని ఏమీ లేవు. ఎవరి స్వప్రయోజనాలకు, ఎవరి అనుకూలతకు చెందినట్లు వారు రాసుకున్న, చేసుకున్న తీర్మానాలే తప్ప ఆ నిబంధనకు ఎలాంటి న్యాయ బద్దత లేదు.
ఒక వ్యక్తి తన శక్తిసామర్థ్యాల మేరకు, తనకున్న పరిచయాల మేరకు ఎన్ని అసోసియేషన్స్ లోనైనా పదవులు చేపట్టవచ్చు అనటానికి మన దివంగత దిగ్దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారే పెద్ద ఉదాహరణ. ప్రస్తుతం కూడా రెండు మూడు పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రముఖులు మన ఇండస్ట్రీలో ఉన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ గారు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షునిగా ఉంటూనే ఆలిండియా కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.గతంలో కూడా ఆయన సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగానే కాకుండా ఇంకా ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
ప్రస్తుతం చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ గారు ఏక కాలంలోనే ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులుగా జోడు పదవులను నిర్వహించడం లేదా? ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న దొర గారు చిత్రపురి కాలనీ కార్యవర్గ సభ్యుడిగా, ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా మూడు పదవులలో ఉన్న విషయం చౌదరి గారి దృష్టిలో లేదా? ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 24 శాఖల సమాఖ్య అయిన ఫెడరేషన్ లోనే వ్యక్తులు జోడు పదవులు, మూడు పదవులలో కొనసాగుతుండగా ఆ ఫెడరేషన్ కు ఎఫిలియేటెడ్ బాడీ అయిన దర్శకుల సంఘంలో మాత్రమే ఈ నిబంధన రాత్రికి రాత్రి ఎలా పుట్టుకొచ్చింది?
ఏ అసోసియేషన్ కైనా సభ్యుల సంక్షేమ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవటంలో స్వతంత్రత ఉంటుంది కానీ సభ్యుల హక్కులను కాలరాసే ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరిచ్చారు?
ఫెడరేషన్ బైలాస్ లో గాని, దర్శకుల సంఘం బైలాస్ లో గాని అలాంటి నిబంధన ఏదీ లేదు. ఒకవేళ ఉన్నా అది ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నాకు వర్తించదు అని తెలిసి కూడా నా నామినేషన్ ను తిరస్కరించడంలోని ఆంతర్యం ఏమిటి? అందుకే నా ప్రజాస్వామిక హక్కును కాలరాసే ప్రయత్నాన్ని సవాలు చేస్తూ నేను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి నా నామినేషన్ కు అనుమతిని సాధించుకున్నాను. కానీ ఈ లోపు నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు ప్రచారానికి సమయం లేకుండా చేయగలిగారు. అయినా ఒకే ఒక్క రోజు ప్రచారంతో 291 ఓట్లు సాధించి కేవలం 6 ఓట్ల తేడాతో నేను ఓటమి పాలయ్యాను. నాకు జరిగిన ఈ నష్టానికి, మానసిక, ఆర్థిక క్లేశానికి సమాధానం ఎవరిస్తారు?
లేని నిబంధనలు చూపించి బాధ్యతారహితంగా నా నామినేషన్ ను ఇన్వాలిడ్ చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కె వి ఆర్ చౌదరి గారా..? లేక అవకతవక నిర్ణయాలతో సభ్యుల హక్కులను కాలరాస్తున్న దర్శకుల సంఘమా?
ఎవరు దీనికి జవాబు దారి?
ఫెడరేషన్ లో భాగమైన దర్శకుల సంఘం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఇలా సభ్యుల హక్కులను కాలరాచే అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటుంది అనటానికి నా ఉదంతమే ఒక ఉదాహరణ. కాబట్టి ఏ ప్రాతిపదిక మీద నా నామినేషన్ తిరస్కరించారో సరైన సంజాయిషీ రాబట్ట వలసిన బాధ్యత ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మీద ఉంది. ఈ విషయంలో ఫెడరేషన్ వారు దర్శకుల సంఘాన్ని నిలదీయాలని, సంజాయిషీ అడగాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
కాగా నా హక్కును, అర్హతను నిరూపించుకునే క్రమంలో నేను ఉన్నత న్యాయస్థానాన్ని, లేబర్ కమిషనర్ ను ఆశ్రయించినప్పుడు చిత్రపరిశ్రమలోని వివిధ అసోసియేషన్స్ లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలకు సంబంధించి అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా అసోసియేషన్లు సంవత్సరాల తరబడిగా ఆడిటింగ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం లేదు. ఇంకా లేబర్ యాక్ట్ లోని ఎన్నో నిబంధనలను పాటించడం లేదు అన్న వాస్తవాలు తెలిశాయి.
ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని అసోసియేషన్ల తీరుతెన్నులను సమీక్షించాలి.
ఇక నా విషయంలో జరిగిన అన్యాయం మరెవరి విషయంలోనూ జరగకూడదు.
ఒక వ్యక్తి తన ప్రతిభా,సామర్థ్యాలను బట్టి ఎన్ని అసోసియేషన్స్ లో నైనా కొనసాగవచ్చు అని చెప్పటానికి నాకు జరిగిన అన్యాయమే రిఫరెన్స్ గా నిలుస్తుంది. కాబట్టి నా ఈ బహిరంగ లేఖకు ఫిల్మ్ ఫెడరేషన్ మరియు దర్శకుల సంఘం నుండి పక్షం రోజులలో సరైన స్పందన రావాలని కోరుకుంటున్నాను. వస్తుందని ఆశిస్తున్నాను..
-ఇట్లు.. భవదీయుడు. ప్రభు (జర్నలిస్ట్ ప్రభు).
Journalist Prabhu Open Letter to Telugu Film Directors Association







































