కళ్యాణ్‌రామ్ ఓకే చేశాడు..!

పటాస్‌తో లభించిన సక్సెస్‌ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాడు కళ్యాణ్‌రామ్. ఆ సినిమాకి వచ్చిన లాభాలన్నింటినీ కిక్2 పై పెట్టేసి చేతులు కాల్చుకొన్నాడు. ఆ సినిమా వల్ల తాను కథానాయకుడిగా నటిస్తున్న షేర్‌కి కూడా కొన్నాళ్లపాటు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే కిక్2 పరాభవాన్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. తన కొత్త సినిమా షేర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆ వెంటనే మరో కొత్త సినిమా చేయడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు తెలిసింది. ఈసారి వీరు పోట్ల దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ నటించనున్నట్టు సమాచారం. బిందాస్, రగడ, దూసుకెళ్తా సినిమాలతో మంచి దర్శకుడు అని నిరూపించుకొన్నాడు వీరుపోట్ల. తదుపరి బిందాస్2 చేస్తాడని ప్రచారం సాగింది. అయితే ఇంతలోనే కళ్యాణ్‌రామ్‌కి వీరుపోట్ల కథ చెప్పాడట. కథ నచ్చడంతో కళ్యాణ్‌రామ్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. షేర్ ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంటనే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టే ఆవకాశాలున్నట్టు తెలిసింది.
స్వతహాగా రచయిత అయిన వీరుపోట్ల బిందాస్‌తో దర్శకుడిగా మారాడు. బిందాస్ ఘన విజయం సాధించినా ఆ తర్వాత వచ్చిన రగడ, దూసుకెళ్తా సినిమాలు బాక్సాఫీసుపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మంచి సినిమాలే అనిపించినా వాటికి చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు దక్కలేదు. అందుకే వీరుపోట్లకి ఇప్పటిదాకా మరో అవకాశం లేదు. చాలామందికి కథలు చెప్పాడు కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. వెంకటేష్, రవితేజలతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకొన్నాడు. కానీ అది కూడా జరగలేదు. ఈసారి మాత్రం కళ్యాణ్‌రామ్‌తో సినిమా పక్కా అని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.







































