రామ్‌గోపాల్‌వర్మ కొత్త సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’.!

స్మగ్లర్ వీరప్పన్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాడో తెలిసిందే. వీరప్పన్‌కి సంబంధించిన యదార్థ సంఘటనల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కన్నడలో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. వీరప్పన్ బ్రతికి వున్నప్పుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి కొన్ని రోజులపాటు తన దగ్గరే వుంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరప్పన్ కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో రాజ్‌కుమార్ తనయుడు నటించడం చర్చనీయాంశమైంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేట్ అయిన సందీప్ ఈ చిత్రంలో వీరప్పన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. అతనికి ఇదే తొలి సినిమా. యజ్ఞశెట్టి, పరుల్ యాదవ్ కూడా ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.







































