ప్రారంభమైన ‘దానవీరశూరకర్ణ’

నందమూరి మూడో తరం నటవారసులు ‘మాస్టర్’ ఎన్టీఆర్, సౌమిత్రిలను వెండితెరకు పరిచయం చేస్తూ శ్రీసాయి జగపతి పిక్చర్స్`సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘దానవీరశూరకర్ణ’. అందరూ బాలనటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సిహెచ్.వెంకటేశ్వర్రావు`జె.బాలరాజు నిర్మాతలు. జె.వి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం, సారధి స్టూడియోలో విశ్వవిఖ్యాతనటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మరియు ఆయన మనవలు జూ॥ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
చిన్నారులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి జూ॥ఎన్టీఆర్ క్లాప్‌నివ్వగా, కళ్యాణ్‌రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నందమూరి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జె.బాలరాజు మాట్లాడుతూ... ‘నందమూరి కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి మా ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు ‘మాస్టర్’ ఎన్టీఆర్, సౌమిత్రిలు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. గత రెండు నెలలుగా ఈ చిత్రం కోసం బాల నటీనటులను ఎంపిక చేస్తూ వచ్చాం. 90 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. అన్న ఎన్టీఆర్ జన్మదినాన మే 28న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకులు జె.వి.ఆర్ మాట్లాడుతూ... ‘అందరూ చిన్నపిల్లలతో తెరకెక్కుతున్న ‘దానవీరశూరకర్ణ’ చిత్రానికి వారే ప్రత్యేక ఆకర్షణ. స్వర్గీయ జానకిరామ్ తనయుడు ‘మాస్టర్’ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కృష్ణుడిగా నటిస్తుండగా, సహదేవుడిగా`కుచేలుడిగా మరో తనయుడు సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. భారీ సెట్స్‌తోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తాం’ అన్నారు.
అప్పటి ‘దానవీరశూరకర్ణ’కు ఏమాత్రం తగ్గకుండా ఈ ‘దానవీరశూరకర్ణ’ను నిర్మిస్తున్నామని మరో నిర్మాత సిహెచ్.వెంకటేశ్వర్రావు తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎన్.సుధాకర్‌రెడ్డి, సంగీతం: కౌశల్య, కళ: ఎస్.ఆర్.కె.శర్మ, నిర్మాతలు: సిహెచ్.వెంకటేశ్వర్రావు`జె.బాలరాజు, రచన`దర్శకత్వం: జె.వి.ఆర్!







































