కోలీవుడ్ నార్త్ బెల్డ్ లో వీక్..1000 కోట్లు అసాధ్యమే!
Kollywood is weak in the North belt
దక్షిణాది చిత్రపరిశ్రమలో కంటెంట్, సాంకేతిక విలువలకు కోలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య వంటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లతో పాటు శంకర్, మణిరత్నం, లోకేష్ కనగరాజ్ వంటి అగ్ర దర్శకులు ఉన్నా? కోలీవుడ్‌కు 1,000 కోట్ల బాక్సాఫీస్ మార్క్ అనేది ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టాలీవుడ్ నుంచి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’, కన్నడ నుంచి ‘కేజీఎఫ్ 2’ వంటి చిత్రాలు సునాయసంగా ఈ మైలురాయిని దాటేశాయి. అయితే తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన `2.0', 'పొన్నియిన్ సెల్వన్', 'జెయిలర్', 'గోట్' వంటి బిగ్ ప్రాజెక్టులు 500 నుండి 700 కోట్ల దగ్గరే ఆగిపోయాయి.
1000 కోట్ల క్లబ్లో కోలీవుడ్ చేరలేకపోవడానికి ప్రధాన కారణం ఉత్తరాది మార్కెట్లో తమిళ సినిమాలకు ఆశించిన స్థాయిలో పట్టు లేకపోవడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోలీవుడ్ సినిమాలు ప్రస్తుతం తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటకలతో పాటు విదేశీ మార్కెట్లపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. ఓవర్సీస్లో ముఖ్యంగా మలేషియా, శ్రీలంక, సింగపూర్, యుఎస్, యూకేలలో తమిళ సినిమాలకు తిరుగులేని వసూళ్లు వస్తాయి. కానీ, భారతదేశంలో అత్యంత భారీ థియేట్రికల్ మార్కెట్ ఉన్న హిందీ బెల్ట్‌లో మాత్రం తమిళ చిత్రాలు ప్రభావం చూపడంలో విఫలమవుతున్నాయి.
హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ప్రమోషన్లు చేయడంలో లేదా అక్కడ బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోవడంలో కోలీవుడ్ మేకర్స్ వెనుకబడుతున్నారు. టాలీవుడ్, శాండల్‌వుడ్ దర్శకులు పాన్-ఇండియా అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుని, నార్త్‌లో నెల రోజుల ముందే అగ్రెసివ్ ప్రమోషన్లతో పక్కా ప్లానింగ్‌తో దిగుతారు. కానీ కోలీవుడ్ సినిమాలు ఎక్కువగా తమిళ స్థానిక సంస్కృతి, నేటివిటీ చుట్టూనే తిరగడం వల్ల లేదా హిందీ మార్కెట్లో సరైన రీచ్ క్రియేట్ చేయకపోవడం వల్ల అక్కడ మినిమమ్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రజనీకాంత్ `2.0` మినహా మరే తమిళ సినిమా కూడా ఉత్తరాదిలో శతకోటి వసూళ్ల మార్కును దాటలేకపోయింది.
చివరిగా సౌత్ రాష్ట్రాలు .. విదేశీ మార్కెట్లపై మాత్రమే ఆధారపడి 1,000 కోట్ల మార్కును అందుకోవడం ఏ ప్రాంతీయ పరిశ్రమకైనా దాదాపు అసాధ్యం. తమిళ చిత్రపరిశ్రమ ఈ ప్రతిష్టాత్మక బెంచ్ మార్క్‌ను చేరుకోవాలంటే కథనంలో సార్వజనీనత పెంచడంతో పాటు నార్త్ ఇండియా మార్కెట్‌ను సీరియస్‌గా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేయక తప్పదు. లేకపోతే వెయ్యి కోట్ల కల కోలీవుడ్‌కు ఎప్పటికీ సవాలుగానే మిగిలిపోతుంది.
















































