మంటల నేపథ్యం.. గన్, గులాబీతో రగ్డ్ లుక్!
Social Media Trolls SRK Kingబాద్షా షారుఖ్ ఖాన్ అక్షరాలా మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి రాబోతున్న చిత్రం `కింగ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానున్న సినిమాకు సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన పోస్టర్ బాలీవుడ్ సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒకవైపు షారుఖ్ అభిమానులు మాస్ అండ్ రొమాంటిక్ అవతార్‌ను చూసి సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం పోస్టర్‌పై తీవ్రమైన కాపీ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా ఈ పోస్టర్ రణ్వీర్ సింగ్ నటించిన `ధురంధర్: ది రివేంజ్` సినిమా పోస్టర్‌ను పక్కాగా కాపీ కొట్టినట్లు ఉందంటూ నెటిజన్లు పోలికలు తెస్తున్నారు. ధురంధర్ 2లో రణ్వీర్ సింగ్ పాత్ర హంజా అలీ మజారీ మంటలు మండుతున్న భవనం నేపథ్యం నుండి నడుచుకుంటూ వచ్చే ఫ్రేమ్‌ను ఇప్పుడు షారుఖ్ కాలిన విమానం నేపథ్యం నుండి నడుచుకుంటూ వచ్చే పోస్టర్‌తో పోల్చుతూ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
అలాగే ఈ పోస్టర్ ఎంతో నాసిరకంగా ఉందని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారుచేసిన చౌకబారు వర్క్‌లా కనిపిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. `ఏదైనా ఒరిజినల్‌గా చేయడం నేర్చుకోండి`, `కాపీ కొట్టడం కూడా సరిగ్గా రాదు. చాట్‌జీపీటీ ప్లస్ లేదా ఏదైనా మంచి పెయిడ్ ఏఐ టూల్ వాడాల్సింది` అంటూ కొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. హాంకాంగ్ యాక్షన్ స్టార్ డోనీ యెన్ నటించిన `రేజింగ్ ఫైర్` పోస్టర్‌తో కూడా దీనికి పోలికలు ఉన్నాయని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు షారుఖ్ అభిమానులు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. 60 ఏళ్ల వయసులోనూ నెరిసిన జుట్టు, గడ్డం, లెదర్ జాకెట్, చేతిలో గన్ , నోటిలో ఎర్ర గులాబీతో షారుఖ్ ఇచ్చిన ఇంటెన్స్ లుక్ మొదటి రోజు 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. `బాద్షా` సినిమాలోని ఆజ్ ఫిర్ యాద్ ఆయా... ఖాతిల్ నహీ... ఆషిక్ హూ' అనే ఐకానిక్ లైన్‌ను క్యాప్షన్‌గా పెట్టడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది.
`పఠాన్` కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారిగా వెండితెరను పంచుకుంటున్నారు. వీరితో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పోస్టర్ రూపకల్పనపై సోషల్ మీడియాలో ఎన్ని వివాదాలు, విమర్శలు తలెత్తినప్పటికీ, 'కింగ్' చిత్రం చుట్టూ ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ఏఐ జనరేటెడ్ డిజైన్ అని, కాపీ అని వస్తున్న ఆరోపణలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. డిసెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ బాద్షా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
















































