బత్తా నెట్ ఫ్లిక్స్ రివ్యూ
Baththa Netflix Review
తమిళనాట విజయ సేతుపతి కీలక పాత్రలో తెరకెక్కిన బత్తా అక్కడి థియేటర్స్ లో బిగ్ హిట్ అవడమే కాదు, తమిళ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా వీక్షించారు. బత్తా తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేసిన ప్రేక్షకులకు థియేటర్స్ లో రాకపోయినా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నంచి తెలుగు వెర్షన్ తో బత్తా ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు అంటే అక్టోబర్ 29 నుంచి తెలుగు, తమిళ లాంగ్వేజెస్ లో అందుబాటులోకి వచ్చింది. మరి బత్తా కథ ఏమిటి అనేది సమీక్షలో చూద్దాం..
బత్తా కథ:
బత్తా (విజయ్ సేతుపతి) ఓ రౌడీ. తనకి ఎదురొచ్చేవాళ్ల కాళ్ళు చేతులు విరగ్గొట్టి అందరిలో భయం పుట్టిస్తాడు. శబరి అనే కుర్రాడు తన ఫ్రెండ్స్ తో బత్తా తన ఇంటిపక్కనే ఉన్న జ్యోతిని కొట్టాడు అని చెబితే.. ఆ పిల్లలు బత్తా అలాంటివాడు, ఇలాంటి వాడు, చంపేస్తాడు, డోర్స్ పగలగొడతాడు అంటూ శబరి లో భయం పుట్టిస్తారు. ఓ రోజు శబరి ఎక్సామ్ హాల్ లో ఎక్సామ్ రాసాక బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడే ఉన్న టీచర్ ఆ బొమ్మను తీసి దాచేస్తుంది. ఆతర్వాత స్కూల్ హాలిడేస్ రావడంతో ఆ బొమ్మని ఎలాగైనా స్కూల్ నుంచి తెచ్చుకోవాలని శబరి స్కూల్ కి వెళ్తాడు. అక్కడ బత్తా వాష్ రూమ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా శబరి డోర్ లాక్ చేస్తాడు. ఆతర్వాత బత్తా చావుబ్రతుకుల మధ్యన బయటపడ్డాక శబరి తన గురించి బత్తా కి తెలిస్తే చంపేస్తాడని భయాపడుతూ ఉంటాడు, బత్తా కూడా తనని వాష్ రూమ్ లో లాక్ చేసిన వారి అంతు చూసేందుకు వేటసాగిస్తాడు. మరి బత్తా కు శబరి గురించి తెలుస్తుందా, తెలిస్తే ఏం జరుగుతుంది అనేదే బత్తా షార్ట్ స్టోరీ.
బత్తా స్క్రీన్ ప్లే:
ఒక చిన్న ఊరిలో రౌడీగా విజయ్ సేతుపతి ఫ్యామిలీ, దిగువ మధ్యతరగది చిన్న కుర్రాడు శబరి ఫ్యామిలీ. అందులో బత్తా గా విజయ్ సేతుపతి, శబరిగా కుర్రాడి కేరెక్టర్స్ మెయిన్ హైలెట్ అనేలా దర్శకుడు కథను నడిపించాడు. బత్తా బాత్ రూమ్ లో ఇరుక్కుని బయటపడేందుకు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. బత్తా ను బందించిన కుర్రాడు భయపడే సన్నివేశాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ ను దాటుకుని సెకండాఫ్, ప్రీ క్లైమాక్స్ ను దాటుకుని క్లైమాక్స్ కి ఈ కథ చేరుకునే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా మొత్తం ఫ్లో తగ్గకుండా మెయింటేన్ చేసిన తీరుకు ప్రేక్షకుడు ఫిదా అవుతాడు.
బత్తా ఎఫర్ట్స్ :
విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన వాష్ రూమ్ లో లాక్ అయినప్పుడు చూపించిన హావభావాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక శబరి కేరెక్టర్ చేసిన సాయి పృథ్వీరాజ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. తప్పు చేసానని అర్ధమైనా ఏమి చెయ్యని నిస్సహాయ స్థితిలో కనిపించే సాయి నటన గొప్పగా అనిపిస్తుంది. విజయ్ సేతుపతితో ఈక్వల్ గా సాయి కనిపించాడు, కాదు నటించాడు అనడంలో సందేహం లేదు. మిగతా నటులు పరిధిమేర కనిపించి మెప్పించారు.
సాంకేతికంగా.. సాయి అభ్యంకర్ BGM, నేటివిటీకి తగ్గట్టుగా సెల్వ కుమార్ ఫొటోగ్రఫీ, కలైవానన్ ఎడిటింగ్ అన్ని బత్తా కి ప్రధాన బలాలు.
బత్తా ఎనాలసిస్:
తమిళ ఫ్లేవర్ ఉన్నా కంటెంట్ బావుంటే.. దానిని తెలుగు ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగా వెయిట్ చేస్తారో అనేది విజయ్ సేతుపతి బత్తా నిరూపించింది. చాలామంది తెలుగు ప్రేక్షకులు తమిళ్ లోనే చూసినా బత్తా ను మరోసారి ఓటీటీ లో వీక్షించేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ కామెడీ విత్ ఎమోషన్స్.. శబరి-బత్తా ల మధ్యన కామెడీ ట్రాక్ లు ఎంత నవ్విస్తాయో, ఎమోషనల్ సీన్స్ కూడా అంతే కదిలిస్తాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కొన్ని సన్నివేశాలు, వాటిలో అంతరార్ధాలు చాలా బాగున్నాయి. బత్తా డెఫనెట్ గా ఓటీటీ లో ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రం.
















































